PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వనమాలి హాస్పిటల్​ ఎండీ, మేనేజర్​ అరెస్టు

1 min read

– అనుమతి లేకపోయినా.. కోవిడ్​ చికిత్స
– రెమ్​డిసివర్​ ఇంజెక్షన్లు బ్లాక్​లో విక్రయం
– డీఎంహెచ్​ఓ కార్యాలయ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు
– వివరాలు వెల్లడించిన కర్నూలు డీఎస్పీ మహేష్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కాసులకు కక్కుర్తి పడి.. కర్నూలు ప్రైవేట్​ ఆస్పతుల యాజమాన్యాలు, వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కోవిడ్​ వైద్య చికిత్సకు అనుమతి లేకపోయినా.. వైద్యచికిత్సలు చేస్తూ.. రోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. కోవిడ్​ అనుమతి లేకపోయినా వైద్య చికిత్సలు చేస్తున్నారని, రెమ్​డిసివర్​ ఇంజెక్షన్లు బ్లాక్​లో విక్రయిస్తున్నారన్న ఆరోపణతో కర్నూలు గాయత్రీ ఎస్టేట్​లోని వనమాలి హాస్పిటల్ఎండీ రాఘవేంద్ర, మేనేజర్​ లవకోటిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కేవీ మహేష్​ వెల్లడించారు. శనివారం స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐలు తబ్రీజ్​, పార్థసారధితో కలిసి డీఎస్పీ మహేష్​ వివరాలు వెల్లడించారు. డీఎంహెచ్​ఓ కార్యాలయ అధికారి వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో ఏప్రిల్​ 29న డీఎంహెచ్​ఓ కార్యాలయ సిబ్బంది, పోలీసులు దాడి చేసి బ్లాక్​లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన రెమ్​ డిసివర్​ను స్వాధీనం చేసుకుని, వనమాలి ఆస్పత్రి ఎండీ రాఘవేంద్ర, మేనేజర్​ లవకోటిని అరెస్టు చేశామన్నారు. వీరికి ఇంజెక్షన్లు అమ్మిన సంపత్​ పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామన్నారు.
మరో నలుగురి అరెస్టు
కోవిడ్​ రోగులకు అత్యవసరమైన రెమ్​డిసివర్​ ఇంజెక్షన్లను బ్లాక్​లో విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్న మరో నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో అపెక్స్​ ఆస్పత్రి మెడికల్​ స్టోర్​ అసిస్టెంట్​ పేరంపోగు రాజమద్దిలేటి, గాంధీనగర్​లో బాలాజి మెడికల్​ ఏజెన్సీ నిర్వాహకుడు మేడం బాలాజి కుమార్​, మెడికల్​ రిప్​లు అమత్తలూరు సతీష్​ బాబు, కొవ్వూరు విజయ్​కుమార్​ను కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఇంజెక్షన్​, నాలుగు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ 420, 406 రెడ్​ విత్​ 34, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ చట్టం 2005 51(బీ),60 (డీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మహేష్​ వెల్లడించారు. ఇదే కేసులో బళ్లారికి చెందిన భీమేశ్వర్​, కర్నూలు గాయత్రి ఆస్పత్రిలో పని చేసే రాజును అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

About Author