ఏపీలో భారీ వర్షాలు ఎక్కడెక్కడంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లోకి నీటి ప్రవాహం పెరుగుతుండడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నీటిమట్టం క్రమేపీ పెరుగుతుండడంతో జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర అల్పపీడనంగా బలపడింది. నేడు అది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా ఉన్న వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండుచోట్ల నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.