ఏపీలో మరో కొత్త పథకం
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా మరో కొత్త పథకం ప్రకటించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలుకు నిర్ణయించారు. వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి…ఇప్పుడు ఈ పథకం అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం కింద ఎస్సీలకు రూ. లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు లక్షా 20 వేలు, ఎస్టీల పెళ్లిళ్లకు లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే లక్షా 20 వేలు ఇవ్వనున్నారు. అలాగే బీసీ పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు అందజేయనున్నారు. ఇక మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష కానుకగా ఇవ్వనున్నారు. తాజాగా ప్రారంభం కానున్న కొత్త పథకాలతో మొత్తం 94.4 శాతం హామీలు నెరవేర్చామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది.