‘కిమ్స్’లో..అరుదైన వైద్యం.
1 min read– 9 నెలల బాలుడికి కిడ్నీలో 2 సెంటీమీటర్ల రాయి!
– ఎండోస్కొపిక్ శస్త్రచికిత్సతో తొలగించిన కిమ్స్ కర్నూలు వైద్యులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. పెద్దవాళ్లు కూడా దాన్ని తట్టుకోలేరు. అలాంటిది కర్నూలు ప్రాంతంలో 9 నెలల బాబుకు ఏకంగా 2 సెంటీమీటర్ల పరిమాణంలోని ఉంది. దానివల్ల మూత్రం సరిగ్గా రాకపోవడం, ఇన్ఫెక్షన్ కూడా తలెత్తడంతో తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి, రాయి విషయాన్ని చెప్పారు. అయితే రాయి పెద్దది కావడం, బాలుడి వయసు బాగా తక్కువ కావడంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ వద్దకు తీసుకొచ్చారు. చిన్న బాలుడు కావడంతో.. పెద్ద కోతలు లేకుండా కేవలం అతి చిన్న పరిణామంలో ఉండే కోతతో ఎండోస్కొపిక్ పద్ధతిలో ఆ పెద్ద రాయిని డాక్టర్ మనోజ్‌కుమార్ తొలగించారు. ఇంత చిన్న వయసు పిల్లలకు, ఇంత పెద్ద రాయిని, అదీ ఎండోస్కొపిక్ పద్ధతిలో తొలగించడం కర్నూలు పట్టణంలో ఇదే మొదటిసారి. దీని గురించి డాక్టర్ మనోజ్‌కుమార్ ఇలా వివరించారు.
“బాబు తీవ్రమైన నొప్పితో ఏడవడంతోపాటు, మూత్రం సరిగ్గా రాకపోతుండటంతో వాళ్ల తల్లిదండ్రులు తొలుత పిల్లల వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తే రాయి విషయం తెలిసింది. అది బాగా పెద్దది కావడంతో, వాళ్లు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. బాబును ఇక్కడకు తీసుకురాగానే అన్నిరకాల పరీక్షలు చేశాం. రాయి బాగా పెద్దది అయినా, వయసు దృష్ట్యా ఎండోస్కొపిక్ పద్ధతిలోనే తీయాలని నిర్ణయించాం. ఇంత చిన్న వయసు పిల్లలు కావడంతో సాంకేతికంగా ఇది చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స. అయినా విజయవంతంగా చేయగలిగాం. సాధారణంగా పిల్లల్లో మెటబాలిక్ సమస్యల వల్ల ఇలాంటి రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. శరీరంలో కాల్షియం, యూరిక్ యాసిడ్ వంటివి ఎక్కువ ఉన్నా వస్తాయి. పెద్దవారిలో అయితే ఆపరేషన్ చేసి, రాళ్లు తీసేసి పంపేస్తాం. కానీ పిల్లల్లో ఇవి మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆపరేషన్ తరువాత స్టోన్ ఎనాలసిస్‌కు పంపుతాం. అందులో కారణం తెలిస్తే సరేసరి. లేకపోతే రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ మెటబాలిక్ ఎవాల్యూషన్, యూరిన్ ఎనాలసిస్, చేయించి, ఏవైనా అసాధారణ పరిస్థితులు ఉంటే వాటిని నియంత్రించడానికి మందులు వాడాల్సి ఉంటుంది” అని ఆయన వివరించారు.