ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి..
1 min read– లేదంటే కేసు నమోదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
పల్లెవెలుగువెబ్, గుడివాడ : రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్భతమైందని, ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 22వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ఆంక్షలు విధించాయని, ఈ క్రమంలో నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం మినీ లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్కు తరలించినా, అధిక ధరలకు విక్రయించిన వారిపై జరిమానా వేసి కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు తూనికల, కొలతల శాఖ అధికారులతో దుకాణాలను తనిఖీ చేయిస్తామని పేర్కొన్నారు.