అరుదైన రెండు తలల మిల్క్ స్నేక్ !
1 min readపల్లెవెలుగువెబ్: రెండు తలల పాముల అంశం చాలా కాలం నుంచీ చర్చల్లో ఉన్నదే. తోక కూడా తలలా ఉండి, రెండు వైపులా కదిలే ఒక రకం పాముల విషయంలో ‘రెండు తలల పాము’ అంటూ తరచూ వార్తలు కూడా వస్తుంటాయి. అవి నిధుల జాడ కనిపెడతాయని, అదృష్టాన్ని కలిగిస్తాయని ఉండే నమ్మకాలే దానికి కారణం. అయితే ఒక తల పక్కనే మరో తలతో అక్కడక్కడ అరుదైన రీతిలో కొన్ని పాములు దర్శనమిస్తుంటాయి. సాధారణ పాములే వివిధ జన్యుపరమైన, ఇతర సమస్యల కారణంగా.. పక్కపక్కనే రెండు తలలతో పుడుతుంటాయి. అమెరికాలోని నార్త్ కరొలినాలో పాముల ఫామ్ నిర్వహిస్తున్న జిమ్మీ మేబ్.. ఇలాంటి ఓ అరుదైన రెండు తలల పాము వివరాలను వెల్లడించారు. ఆరెంజ్, తెలుపు రంగుల పట్టీలతో ఉన్న ఈ పాము.. ‘హొండూరన్ అల్బినో మిల్క్ స్నేక్’ జాతికి చెందినదని వెల్లడించారు. రెండు తలలు, ఒకే శరీరం ఉండటంతో ఆ పాము కదలికలు, ఇతర అంశాల్లో ఏ తల నిర్ణయం తీసుకుంటుందన్న సందేహాలకు జిమ్మీ వివరణ ఇచ్చాడు. ఏ తల నేలకు ఆని ఉంటే.. ఆ తల నిర్ణయానికి అనుగుణంగా పాము శరీరం వ్యవహరిస్తుందని తెలిపారు. చేతిని దగ్గరగా పెడితే రెండు తలలతోనూ కాటు వేస్తుందని వివరించారు. అయితే ఈ పాములో విషం ఉండనందున ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు.