బలవంతంగా రుద్దితే దేశం ముక్కలు !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందీ భాషను బలవంతంగా రుద్దితే దేశం ముక్కలవుతుందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్.అళగిరి వేర్వేరుగా కేంద్రాన్ని హెచ్చరించారు. ‘‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో ఏర్పాటైన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇటీవల సమావేశమై మొత్తం 112 సిఫార్సులతో 11వ నివేదికను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది. అధికార భాష పేరుతో దేశ వ్యాప్తంగా హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం గుట్టుచప్పుడుకాకుండా చర్యలు చేపట్టింది. ఇది హిందీ భాష తెలియని ప్రజలపై సాగించే యుద్ధమే. ఆంగ్ల భాషను పూర్తిగా అరికట్టి, హిందీ భాషను అన్ని స్థాయిల్లో నిర్బంధం చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మన దేశంలో ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి అనే పేరుతో హిందుత్వ శక్తులు ప్రచారం చేయడం ఖండించతగ్గది. సంస్కృతం, లేదా ఆ ఛాయలు ఉండే హిందీని బలవంతంగా అమలు చేయడమే ఆ ప్రచార లక్ష్యం. ఇదేపరిస్థితి కొనసాగిన పక్షంలో దేశంలో అలజడి చెలరేగి, ప్రశాంత వాతావరణానికి భగ్నం ఏర్పడుతుంది. ఇది మరో వివాదానికి దారితీస్తుది’’ అని వైగో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.