వీడియో గేమ్స్ పిల్లలకు ప్రాణాంతకం !
1 min readపల్లెవెలుగువెబ్: వీడియో గేమ్స్ ఆడటమనేది చాలామంది పిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యాపకం. ఈ వ్యాపకం కొంతమంది పిల్లలకు ప్రాణాపాయంగా పరిణమించే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియాలోని హార్ట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు తాము చేసిన అధ్యయనం తాలూకు నివేదికను హార్ట్ రిథమ్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ‘‘కొంతమంది పిల్లల్లో హృదయ స్పందన క్రమబద్ధంగా ఉండదు. తల్లిదండ్రులు దాన్ని ముందుగా గుర్తించరు. అలాంటి చిన్నారులు వీడియో గేమ్స్ ఆడినప్పుడు వారి హృదయంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆట ఆడుతూ ఒక్కసారిగా స్పృహ కోల్పోవడం వీరిలో సమస్యకు మొదటి సూచన. మల్టీప్లేయర్ యుద్ధాల తరహా వీడియో గేమ్స్‌లో అధిక శాతం మంది స్పృహ కోల్పోయినట్లు గుర్తించాం. కొంతమందికి ఏకంగా గుండె ఆగిపోయిందని వెల్లడైంది. కాటెకొలామినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాకీకార్డియా, కాంటెనిటల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అనే సమస్య పిల్లల్లో ఈ అనారోగ్యం తలెత్తేందుకు కారణం. ఎలక్ట్రానిక్ గేమింగ్ విధానంలో పిల్లల కుటుంబాలు, ఆరోగ్య సంస్థలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పరిశోధకులు తెలిపారు.