హిజాబ్ పై తేల్చని సుప్రీం !
1 min readపల్లెవెలుగువెబ్: కర్ణాటకలో హిజాబ్ ధారణపై నిషేధం విధింపు సముచితమో కాదో సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేకపోయింది. ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా గురువారం పరస్పరం భిన్నమైన తీర్పులు వెలువరించారు. హిజాబ్ ధరించడం అమ్మాయిల వాక్‌స్వాతంత్య్రం, మతస్వేచ్ఛకు సంబంధించిందని జస్టిస్ ధూలియా పేర్కొనగా.. హిజాబ్ ధారణ అత్యవసర ఇస్లాం సంప్రదాయం కాదని జస్టిస్ గుప్తా స్పష్టం చేశారు. ఉభయుల నడుమ ఏకాభిప్రాయం లేకపోవడంతో అప్పీళ్లన్నిటినీ తదుపరి చర్యల కోసంప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని ద్విసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్ గుప్తా ఆదేశించారు. ఈ వ్యవహారంపై వేరే త్రిసభ్య ధర్మాసనం గానీ.. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గానీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవాద వర్గాలు అంటున్నాయి.