PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మురుగు నిర్వాహణలో నిర్లక్ష్యం…

1 min read

–దుర్గంధంతో స్థానికుల ఇక్కట్లు.. చోద్యం చూస్తున్న అధికారులు
పల్లెవెలుగు, బండి ఆత్మకూరు: బండి ఆత్మకూరు మండలంలోని జి. లింగాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ, బిసి కాలనీలో వర్షం నీరు, మురుగునీరు నిల్వ ఉంటూ నడవడానికి ఇబ్బందికరంగా మారిందని, సిసి రోడ్లపై మురుగునీరు అక్కడే నిల్వ ఉంటూ మురుగుగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. మరియు మురుగునీరు అక్కడే నిల్వ ఉండటంతో దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో వృద్ధులు, చిన్న పిల్లలు రోడ్డుపై నడవాలంటే నరకయాతన పడుతున్నారని, ఎక్కడ కింద పడతామో అని భయాందోళన చెందుతున్నారు. పారిశుధ్యం లోపించి దోమలు వృద్ధి చెంది ప్రజలపై దాడి చేస్తూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాల బారిన పడుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. పారిశుద్ధ్యం పై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు , ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గ్రామాలు అభివృద్ది చెందాలని, ప్రజలకు అన్నిరకాల సేవలు అందుబాటులో ఉండాలని సచివాలయాల వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. కానీ అధికారులు గ్రామంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలేదని, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జి. లింగాపురం గ్రామంను సందర్శించి పారిశుధ్యం పై చర్యలు తీసుకోవాలని, ప్రజలు డెంగ్యూ, మలేరియా, విష జ్వరాల బారిన పడకుండా ఫాగింగ్ చేయించాలని, మురుగునీరు, వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. స్థానికురాలు ఓబులమ్మ మాట్లాడుతూ మురుగునీరు నిల్వ ఉండడం వలన పిల్లలు రోగాల బారిన పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నానని తెలియజేసింది.

About Author