చిన్నారి ప్రాణాలు కాపాడిన నైట్రిక్ ఆక్సైడ్ థెరపీ
1 min read– విజయవంతంగా చికిత్స చేసిన కర్నూలు కిమ్స్ వైద్యులు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : ఊపిరితిత్తుల రక్తనాళాలల్లో పీడనం పెరిగినప్పుడు చిన్న పిల్లలకు ఊపిరి అందక తీవ్రమైన ఇబ్బంది తలెత్తుతుంది. దానికి కారణాలు తెలుసుకోవడం, సరైన సమయంలో సరైన చికిత్స అందించడం చాలా ముఖ్యం. లేకపోతే పలురకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లో నిపుణులైన వైద్యులు ఉండటం, అదే సమయంలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండటం ముఖ్యం. ఆదోనికి చెందిన ఒక నవజాత శిశువుకు ఊపిరి అందకపోతుండటంతో ఏమైందో తెలియక వెంటనే కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్ ఏమాత్రం అందకపోతుండటంతో వెంటనే వెంటిలేటర్ మీద పెట్టి, కార్డియాలజిస్టు డాక్టర్ రాఘవేంద్ర 2డి ఎకో పరీక్ష చేశారు. అందులో ఆ శిశువుకు పీ.పీ.హెచ్.ఎన్ (ఊపిరితిత్తుల రక్తనాళాలల్లో పీడనం బాగా ఎక్కువగా ఉండటం) అనే సమస్య ఉన్నట్లు తేలింది. దాంతో నియోనాటాలజిస్ట్ డాక్టర్ నవీద్ మరియు డా. భారతి ఆధ్వర్యంలో ఆ శిశువుకు చికిత్స ప్రారంభించారు. ముందుగా హైఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ మీద పెట్టి, నైట్రిక్ ఆక్సైడ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. క్రమంగా శిశువు పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు అలా నైట్రిక్ ఆక్సైడ్‌తో చికిత్స చేసి, 6 రోజులు వెంటిలేటర్ మీద పెట్టారు. మొత్తం రెండు వారాల పాటు ఎన్ఐసీయూలో ఉంచి పరీక్షించిన తర్వాత శిశువు పరిస్థితి పూర్తిస్థాయిలో బాగుపడిందని తేలడంతో తల్లిపాలు పట్టించి, డిశ్చార్జి చేశారు. పీ.పీ.హెచ్.ఎన్ సమస్య ఉన్నప్పుడు దానికి చికిత్స చేయడంలో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. సాధారణంగా రాయలసీమ ప్రాంతంలో ఈ సమస్య ఉన్న చిన్నారులను గతంలో అయితే చికిత్స కోసం హైదరాబాద్ లేదా బెంగళూరుకు తరలించేవారు. ఇలా అసలే అనారోగ్యంతో ఉన్న చిన్నపిల్లలను దూరప్రాంతాలకు తరలించడం అత్యంత ప్రమాదకరం. దారిలోనే వారికి ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఇప్పుడు కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలోనే నైట్రిక్ ఆక్సైడ్ మిషన్ ఉండటంతో ఇలాంటి శిశువులకు ప్రాణదానం చేయడం సాధ్యమవుతోంది.