ఎన్నికల అప్పుల భారం.. యువ సర్పంచ్ ఆత్మహత్య
1 min readపల్లెవెలుగువెబ్ : ఎన్నికల కోసం చేసిన అప్పులు గుట్టలా పేరుకుపోవడంతో తీర్చే మార్గం కనిపించక చివరికి దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు తీసుకున్నాడు ఓ యువ సర్పంచ్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామ సర్పంచ్, అధికార టీఆర్‌ఎ్‌సకు చెందిన సుంచు సంతోష్ (37) అనే యువ సర్పంచ్‌దీ విషాదాంతం. గతంలో సంతోష్ ఎర్దండి, మూలరాంపూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం మూలరాంపూర్ సర్పంచ్‌గా బరిలో నిలిచినా పరాజయంపాలయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా గత సర్పంచ్ ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొని మూలరాంపూర్ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఎన్నికల ఖర్చు కోసం సంతోష్ దొరికినచోటల్లా అప్పులు చేయడం, మధ్యవర్తిగా ఉండి కొందరికి అప్పులు ఇప్పించడంతో దాదాపు రూ.30 లక్షల దాకా పేరుకుపోయాయని తెలిసింది. ఈ అప్పులు ఎలా తీర్చాలో అంటూ తరచూ ఆయన బాధపడేవారని సన్నిహితులు చెప్పారు. గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు అడ్డుకున్నట్లు సమాచారం. ఆదివారం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన సంతోష్, అక్కడే చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.