పోలింగ్ కేంద్రాలను దగ్గరగా ఏర్పాటు చేయండి
1 min readకలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు
పల్లెవెలుగు, కర్నూలు;
నగరంలోని 29వ డివిజన్ పరిధిలో 8 పోలింగు కేంద్రాలు రెండు నుండి ఐదు కి.మీ. దూరం పెట్టారని ఆ పోలింగ్ కేంద్రాలను దగ్గరగా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు శుక్రవారం కలెక్టర్‌ను కలిసిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు పొలంకి రామస్వామి మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ డ్రాఫ్ట్ లిస్టు ప్రకారం 29వ డివిజన్ ఓటర్లకు గల 8 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అన్ని కల్లూరు లోని జె.పి హైస్కూల్ లో పెట్టారని ఓటర్లకు ఇవి చాలా దూరమని ,రెండు నుండి ఐదు కిలోమీటర్లు దూరంలో మూడు, నాలుగు వార్డులు దాటించి పెట్టారని ఆయన దృష్టి కి తీసుకెళ్ళారు. అదేవిధంగా డివిజన్ శరీన్ నగర్ నుంచి గుత్తి పెట్రోల్ బంకు దాటి, ఆర్టీసి కాలనీ, వెంకన్న బావి, రాగమయూరి దాటి లక్ష్మిపురం రోడ్ వరకు ఉందని అలాగే మరికొంత మంది ఓటర్లు, లక్ష్మీపురం, పందిపాడు గ్రామాలకు చెందిన వారున్నారని డ్రాఫ్ట్ లిస్టులో కేవలం రెండు కి.మి. అని వ్రాశారని రాగమయూరి,లక్ష్మీపురం రోడ్డు కల్లూరుకు ఐదు కి.మి. ఉందని కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళారు. దీని వలన ఓటర్లు ఓటు వేయడానికి ముందుకురారని ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమని అన్నారు. 8 పోలింగ్ స్టేషన్లను ఓటర్లకు అనుకూలంగా దగ్గర దగ్గర ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కాలనీలో, అనేక ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలున్నాయని తెలిపారు. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, ఓటర్లకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కర్నూల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా గతంలో వేసిన నామినేషన్లలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని అవి హడావిడిలో జరిగాయని 17వ డివిజన్ లో ఒకటి, రెండు పార్టీల వారి నామినేషన్లలో జరిగిన పొరపాట్లను విచారించి సానుకూలంగా స్పందించి, అందరిని అనుమతించేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పూల రంగస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల ప్రభాకర్ రెడ్డి ,వెంకట హరి, బీజేవైఎమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరెడ్డి దినేష్ రెడ్డి, ఓబిసి మోర్చా నాయకులు మురళీ తదితరులు ఉన్నారు.