నమ్మించారు… వంచించారు..!
1 min readస్నేహం ముసుగులో మోసం చేశారు …ఇల్లునే కాజేయాలని కుట్ర
పాస్టర్ రాజు దంపతుల ఆవేదన
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: స్నేహం ముసుగులో తనను మోసం చేయడమే కాకుండా తన ఇంటిని కాజేయాలని వరుణ్ కుట్ర పన్నాడని పాస్టర్ మురుదుడ్డి.రాజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు.ఆయన బుధవారం నాడు స్థానిక సత్రంపాడు ఎంఆర్ సి కాలనీ వద్ద ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.వరుణ్,తాను, మరో వ్యక్తి ముగ్గురం స్నేహితులమని,ముగ్గురం కలిపి వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నామని తెలిపారు.దానిలో భాగంగానే తన నగదుతో వారు దేశవ్యాప్త పర్యటనలు చేశారు.కానీ ఎటువంటి వ్యాపారం చేయలేదని ఈ విషయాన్ని తాను ఆలస్యంగా గుర్తించానని తెలిపారు.అప్పటికే స్నేహం ముసుగులో తన ఇంటిని అద్దెకు తీసుకొని వరుణ్ నివాసం ఏర్పరచుకున్నారని తెలిపారు.అయితే వారు తన ఇంటిని కబ్జా చేసేందుకు కుట్రపన్నారనే విషయాన్ని తాను గ్రహించలేదని,వారిని పూర్తిగా నమ్మానని వాపోయారు.తీరా ఇంట్లో అద్దెకు దిగిన తర్వాత సుమారు నాలుగు నెలల నుంచి అద్దె చెల్లించడం లేదని, ఈవిషయంపై ప్రశ్నించిన తన భార్యను కులం పేరుతో దారుణంగా దూషించడమే కాకుండా చంపుతామని బెదిరించారని ఆరోపించారు. అద్దె చెల్లించాలని తాను ఒత్తిడి చేయడంతో వారి అసలు స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు.తాను,వరుణ్ కు లక్షలకు ఇంటిని అమ్మానని స్థానికంగా తప్పుడు ప్రచారం చేశారని,ఈ విషయం తెలుసుకొని వారిని ఇల్లు ఖాళీ చేయాలని ప్రాధేయపడ్డామన్నారు,కానీ వారు మాత్రం ఆ ఇల్లు తనదేనంటూ దౌర్జన్యానికి దిగటం,పొంతనలేని కారణాలతో బుకాయించడం దుర్మార్గం అన్నారు.ఆ ఇంటిని తాను అమ్మినట్లయితే దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని అలా చూపించకపోవడంతోనే వారి అసలు స్వరూపం బయటపడిందని చెప్పారు.ఎటువంటి పత్రాలు లేకుండా లక్షలు తనకు ఇచ్చానని ఎలా చెబుతారని ప్రశ్నించారు.తనకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని,ఆర్థికంగా కూడా తాను బలవంతుడనని,తాను ఏం చెబితే అది జరుగుతుందని వరుణ్ బెదిరింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు.తన వద్ద తన ఇంటికి సంబంధించిన పూర్తి దస్తావేజులు ఉన్నాయని వారికి అమ్మినట్లయితే వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తన భార్య మురుదుడ్డి.రత్నావలిని కులం పేరుతో చెప్పుకోలేని విధంగా దూషించి మనోవేదనకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,తనకు తమ కుటుంబానికి న్యాయం చేయాలని దంపతులు ఇరువురు కోరారు.