ఉప్పు, చెట్ల ఆకులే భోజనం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో జనం పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధులు చెబుతున్నారు. అక్కడి ప్రజలకు రోజుల తరబడి భోజనమే దొరకని పరిస్థితి నెలకొందని వివరించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో, మరో దారిలేక ఉప్పూ, చెట్ల ఆకులు తింటూ కడుపు నింపుకుంటున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన మార్టిన్ గ్రిఫిత్ తెలిపారు. గ్రిఫిత్ ఇటీవల బుర్కినా ఫాసోలో పర్యటించారు. ఓవైపు ఉగ్రవాదం, మరోవైపు సైనిక పాలన.. బుర్కినా ఫాసో ప్రజల జీవితాలను దుర్భరం చేశాయని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు మరే ఇతర సంస్థల నుంచి వారికి సాయం అందించడం సాధ్యం కావడంలేదని వాపోయారు. దేశంలోని చాలా ప్రాంతాలను అక్కడి ఉగ్రవాదులు మిగతా ప్రపంచంతో సంబంధంలేకుండా చేశారని గ్రిఫిత్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సైనికులపై దాడి చేసి ఉగ్రవాదులు వారిని మట్టుబెడుతున్నారని చెప్పారు.