ఆవోపా సేవలు అభినందనీయం…
1 min read– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవ కార్యక్రమాలు అభినందించదగ్గవని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక ఎం ఆర్ సి ఫంక్షన్ హాల్ నందు ఆవోపా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1972వ సంవత్సరంలో ప్రారంభమైన ఆవోపా తన ఉన్నతమైన కార్యక్రమాలతో, ఆర్యవైశ్యులకు చేయూతను అందిస్తూ, వారి ఆదరాభిమానాలను కూడగట్టుకుందన్నారు. భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నప్పటికీ ఒక్క ఆర్యవైశ్యులు మాత్రమే ఒకే కుటుంబ సభ్యుల లాగా ఉంటారని టీజీ అన్నారు. ఆర్యవైశ్య కులంలో పుట్టిన వారందరూ వాసవి మాత పిల్లలము అని అనుకోవడమే ఇందుకు కారణం అని ఆయన అన్నారు. రాజకీయంగా పదవులలో ఉంటే ఎవరికైనా, ఎన్ని విధాలుగా నైనా సాయం అందించవచ్చునని, అదే వ్యక్తిగతంగా అయితే కొద్ది మంది మాత్రమే సహాయం అందివ్వగలమని టీజి అన్నారు. అందుకే తాను రాజకీయాల్లో ఉన్నానని, రోశయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తాను ఎమ్మెల్యేగా ఉన్నానని మంత్రిగా కూడా చేయలేనంత అభివృద్ధి పనులు అప్పట్లో ఎమ్మెల్యే గానే చేశానని టీజీ తెలిపారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా కూడా ఎదిగి మిగిలిన వారికి ఏమాత్రం తీసిపోము అన్న విధంగా, బలంగా తయారు కావాలని టీజీ కోరారు. అవోపా సంస్థ ఒక ప్రక్క ప్రణాళికతో విభిన్న సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఆర్యవైశ్యులను ఆదుకోవడం ఆనందించదగ్గ విషయం అని టీజీ వెంకటేష్ అన్నారు. ఆవోపా స్వర్ణోత్సవాలసందర్భంగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, 50 ఆర్యవైశ్య దంపతులకు షష్టిపూర్తి కార్యక్రమం నిర్వహించారు. అలాగే 50 మంది విద్యార్థులకు 8 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవోపా నాయకులు తడవర్తి రాంబాబు, ఆరువేటి నిర్మల, శేషయ్య, ఇల్లూరు లక్ష్మయ్య, సురేష్, జవహర్, తదితరులు పాల్గొన్నారు.