నట్టేట ముంచిన నకిలీ పత్తి విత్తనాలు..!
1 min read–జాడ లేని పూత, కాయ- ఏపుగా పెరిగిన పత్తి చెట్లు – ఆందోళనలో రైతులు.
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: మిడుతూరు మండలంలోని వీపనగండ్ల, చెరుకుచెర్ల, మిడుతూరు రైతులు సాగు చేసిన పత్తి పంట ఏపుగా పెరిగినా పూత, కాయలు పట్టలేదు.. సాగు చేసిన పత్తి విత్తనాలు నకిలీ కావడంతోనే పూత, కాయలు పట్టడం లేదని గ్రహించిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మిడుతూరు మండలంలో మొత్తం 40 వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు 6 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఖరీఫ్ సీజన్లో ఎన్నో ఆశలతో పతి పంట సాగు చేసిన రైతులకు నిరాశే ఎదురయింది. మిడుతూరులో దాదాపు 25 మంది రైతులు మైకో కంపెనీకి చెందిన పత్తి విత్తనాలను 70 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.వీపనగండ్ల లో దాదాపు 40మంది రైతులు నూజివీడు గోల్డ్ కంపెనీకి చెందిన పత్తి విత్తనాలను 300 ఎకరాలు సాగుచేశారు .ఎకరాకు దాదాపు రూ. 20 వేల నుండి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరిగిన కాయలు, పూత లేకపోవడంతో నకిలీ పత్తి విత్తనాల వలన చాలా నష్టపోయామనిరైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ. 30 వేలు పెట్టుబడి పెట్టి పంట రాకపోతే అప్పుల పాలవుతామని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఇలాంటి నకిలీ పత్తి విత్తనాలు ఇంకా మండలంలో ఎన్నో గ్రామాలలో రైతులు సాగు చేసి నష్టపోయారని రైతులు మాహేశ్వర య్య , శ్రీనివాసులు, రవి, మద్దిలేటి, శ్రీధర్, దస్తగిరి, ఖాలీల్, ప్రతాప్ రెడ్డి, ఆంజనేయులు, శంకర్, వెంకట లక్ష్మమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు వాపోతున్నారు.నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీనివాస ట్రేడర్స్, సాయిరాం సీడ్స్, డీలర్ల పై చర్యలు తీసుకోవాలని బుధవారం నందికొట్కూరు ఏడీఏ విజయ శేఖర్,వ్యవసాయ అధికారి వీరు నాయక్ కు రైతులు ఫిర్యాదు చేశారు. .ఇప్పటికైనా వ్యవసాయ జిల్లా అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పది సార్లు మందు పిచికారి చేసినా పూత, కాయలు లేవు.చంద్రగిరి మహేశ్వరయ్య, రైతు. వీపనగండ్ల .
ఇరవై నాలుగు ఎకరాల పొలంలో పత్తి పంట సాగు చేశాను. దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాను. దాదాపు పది పర్యాయాలు రసాయన మందులు పిచికారి చేశాను. అయినా పూత, పింజ రాలేదు. చివరికి మాకు ఇచ్చిన విత్తనాలు నకిలీవని తేలిపోయింది. ఎంతో పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే కాయలు పూత రాకపోవడంతో చాలా ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
నూజివీడు కంపెనీ విత్తనాలు నిలువునా ముంచాయి..వెంకట లక్ష్మమ్మ, రైతు, వీపనగండ్ల.
నాకున్న మూడు ఎకరాల పొలంలో మైకో కంపెనీ పత్తి పంట సాగు చేశాను. ఒక ఎకరాకు 20 నుంచి 35 వేల రూపాయల దాకా పెట్టుబడులు అయ్యాయి. పత్తి పంటలో మొక్క ఎదిగింది తప్ప పూత, కాయలు సరిగా రావడం లేదు. ఏదో ఒక పూత వస్తే అది వెంటనే రాలిపోతుంది. ఏ అధికారులకు చెప్పినా పట్టించకపోవడం లేదు. మైకో కంపెనీ పత్తి విత్తనాలు నిలువునా ముంచాయి. ప్రభుత్వం ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. మాకు నష్టపరిహారం అందే విధంగా అధికారులు చూడాలి.