ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ ఏలూరు : కొత్తగా పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామివేత్తలకు పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నదని, వాటిని అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి. యేసుదాసు విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా పరిశ్రమ కేంద్రంలో గురువారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి సదస్సు, అవగాహన కార్యక్రమం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పి. యేసుదాసు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యేసుదాసు మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా .2020-23 ఇండస్ట్రియల్ పాలసీ, జగనన్న బడుగు వికాసం పాలసీ మరియు పి.యం.ఇ.జి.పి. పథకాల ద్వారా క్రొత్తగా పరిశ్రమలు స్థాపించేవారికి రాష్ట్ర ప్రభుత్వ పలు రాయితీలు అందిస్తున్నది, ఐ.డి.పి. 2020-23 పాలసీ మరియు జగనన్న బడుగు వికాసం పథకాలు మార్చి 31, 2023 వరకు అమలులో ఉంటాయన్నారు. జగనన్న బడుగు వికాసం పథకం క్రింద ఎస్.సి. మరియు ఎస్.టి. లకు ప్రాజెక్ట్ విలువలో 45 శాతం సబ్సిడీగా లభిస్తుందన్నారు. ఈ పథకం క్రింద తయారీ మరియు సేవా రంగాలతో పాటుగా ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్, జె.సి.బి.లు, ఫంక్షన్ హాలులు మొదలైనవి కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అమలు చేస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఔత్సాహికులు వాటిని అవగాహన చేసికొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. క్రొత్తగా పరిశ్రమలు నెలకొల్పదలచిన వారు ముందుగా వారు ఏర్పాటుచేయబోయే యూనిట్ ను ఎంచుకొని అందుకు సంబంధించి సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసుకోవాలన్నారు. అనంతరం బ్యాంకు వారితో సంప్రదించి ఆ తర్వాత పరిశ్రమ స్థాపనకు చర్యలు చేపట్టాలన్నారు. వారు తీసుకొనవలసిన అప్పూవల్స్ కొరకు సింగిల్ డెస్క్ పోర్టల్ లో దరఖాస్తు చేస్తే 7 నుండి 21 రోజుల లోపు అనుమతులు లభిస్తాయన్నారు. అయితే తయారీ లేదా సేవా రంగంలో క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మంచి మనుగడ ఉంటుందన్నారు.డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఒకేసారి పెద్ద ప్రాజెక్టులకు పోకుండా చిన్నగా పరిశ్రమలను స్థాపించుకొని అంచెలంచెలుగా దానిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. తీసుకున్న ఋణాలను సక్రమముగా చెల్లించి తమ సిబిల్ స్కోరును పెంచుకున్న వారికి సి.జి.టి.యం.ఎస్.ఇ. స్కీము ద్వారా సెక్యూరిటీ లేకుండానే ఋణాలు మంజూరు చేస్తామన్నారు,జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్, సుమదురవాణి మాట్లాడుతూ పి.యం.ఇ.జి.పి. పథకం క్రింద తయారీ రంగంలో రూ.10 లక్షల లోపు ప్రాజెక్టులకు, సేవా రంగంలో రూ.5 లక్షల లోపు ప్రాజెక్టులకు అభ్యర్ధులకు క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదన్నారు. తయారీ రంగం క్రింద రూ. 50 లక్షల వరకు సేవా రంగం క్రింద రూ.20 లక్షల వరకు ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.ఇండస్ట్రియల్ప్రమోషన్ ఆఫీసర్, నాగేంద్ర భూపాల్ మాట్లాడుతూ పరిశ్రమలు నివాస స్థలములలో స్థాపించరాదన్నారు. పరిశ్రమ స్థాపించే భవనము అద్దె భవనమైతే దానికి రిజిస్టర్డ్ లీట్ డీడ్ తీసుకోవాల్సివుంటుందన్నారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేటప్పుడు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు వుంటే ఐ.పి.ఓ.లను లేదా అధికారులను సంప్రదించాల్సిందిగా కోరారు.ఈకార్యక్రమములో ఐ.పి.ఓ. యువరాం కిషోర్, పరిశ్రమల శాఖ అధికారులు, బ్యాంకర్లు, మరియు అధిక సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.