PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి..

1 min read

భూ-రీసర్వే పై ఉద్యోగులకు సమయం ఇవ్వాలి..!
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమంగా చేపట్టిన భూ-రీసర్వే విషయంలో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచడం తగదని,దీనివల్ల కొందరు అధికారులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ ఉన్నాయని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు,ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు.వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఏలూరు జిల్లా ఏలూరులోని నూతనంగా ఆధునికీకరించిన రెవెన్యూ సమావేశ మందిరాన్ని (కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ రెవెన్యూ సమావేశ మందిరం) ఆయన శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రీసర్వే వల్ల భూ యజమానులకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని దీనికి తాము వ్యతిరేకులు కాదని ఆయన తెలిపారు. తాము 24 గంటలూ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ఒత్తిడి చేయడం వల్ల రీసర్వేలో తప్పులు వస్తాయని, దీనివల్ల రైతులు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని యూనిట్ గా ఎంపిక చేయడం భావ్యం కాదన్నారు. ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా భూములు ఉంటాయని,ఒక గ్రామంలో వందల ఎకరాలు ఉంటే మరొక గ్రామంలో వేలాది ఎకరాలు భూములు ఉంటాయని చెప్పారు. అలాంటప్పుడు ప్రతి గ్రామానికీ 30 రోజులు కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. రీసర్వే కు తమకు తగినంత సమయం కేటాయించాలని కోరారు. రీసర్వే వల్ల రెవెన్యూ శాఖకు మంచి పేరు వస్తుందని , అలాంటి దాంట్లో తప్పులు దొర్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని అన్నారు. రీసర్వే ఒత్తిడి వల్ల చాలామంది అధికారులు సెలవులపై వెళ్ళిపోతున్నారన్నారు. రీసర్వే వల్ల ముగ్గురు విఆర్వోలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు.వీఆర్వోలు ఎవరూ ఆత్మహత్యల వైపు కన్నెత్తి చూడొద్దని,తమ సంఘం పూర్తి అండగా ఉంటుందని, ప్రభుత్వంతో ఈ విషయంపై మాట్లాడి న్యాయం జరిగే విధంగా చూస్తామని అన్నారు. రీసర్వేకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదన్నారు. అలాంటప్పుడు ఎలా చేపట్టగలమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు పది లక్షల మంది ఉద్యోగులు డిఎ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వి రాజేష్ , ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ కృష్ణమూర్తి , స్టేట్ సెక్రటరీ జనరల్ వైవి రావు, జిల్లా అధ్యక్షులు కె. రమేష్ కుమార్,కార్యదర్శి ఏ ప్రమోద్,పలువురు రెవిన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

About Author