PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిద్దార్థ టార్గెట్ 2024..!

1 min read

– సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి రెడీ ..! మ్మెల్యే లేదా ఎంపీ గా బరిలోకి..
– బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సీటు కోసం సీఎం జగన్ పై ఒత్తిడి..?
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర రాజకీయాలలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పేరు ఒక సంచలనం.లక్షలాది మంది యువకుల గుండె చప్పుడు సిద్దార్థ.2024 ఎన్నికలలో ఎమ్మెల్యే లేదా ఎంపీ గా పోటీ చేసి అసెంబ్లీ లేదా పార్లమెంట్ లో అడుగుపెట్టాలన్నదే ఆయన అభిమానుల కోరిక. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న నాయకుడు. రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నవారు కూడా వారి వారి నియోజకవర్గాలకు, లేదంటే జిల్లాకు పరిమితమయ్యేవారు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎదిగినవారు బహు తక్కువ. కానీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంటనే అనూహ్యంగా రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రస్థాయి నేతగా బైరెడ్డి పేరు తెచ్చుకున్నారు. యువతలో అతనికున్న ఫాలోయింగ్ అతి తక్కువమందికే ఉంది.
శాప్ చైర్మన్ గా..
బైరెడ్డి ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. శాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో సిద్ధార్థ్ రెడ్డి పేరు పిలిచినప్పుడు దాదాపు 5 నిముషాలకు పైగా హాలు మారుమోగిపోయింది. ఆ క్రేజ్ చూసిన చూసిన మంత్రులకు కూడా మతిపోయినంత పనైంది. ఆయనకు యువతలో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు.
వైసీపీ తరఫున తీవ్రమైన పోటీ…
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులకుకానీ, ఎంపీ అభ్యర్థులకుగానీ పోటీచేయడానికి తీవ్ర పోటీనెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేతోపాటు ఇద్దరేసి, ముగ్గురేసి చొప్పున పోటీపడుతున్నారు. అంతటి తీవ్రమైన పోటీ నెలకొన్న సందర్భంగా బైరెడ్డికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు కేటాయించాలని అతని అనుచరులు ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నారు. బైరెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు. సమన్వయకర్తగా ఉన్నప్పటికీ అది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో నందికొట్కూరు నియోజకవర్గంలో అవకాశం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులే ఉన్నారు.
ఏదో ఒక సీటు కేటాయించమని కోరుతున్న అనుచరులు..
ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే తర్వాత ఎన్నికల్లో కూడా పోటీచేయబోతున్నారు. అయితే పనితీరు మెరుగుపడనివారికి, తన సర్వేలో విజయం సాధించలేనివారికి సీటివ్వనని జగన్ ఖరాఖండిగా తేల్చేశారు. రానున్న ఎన్నికల్లో పనిచేయనివారిని తొలగిస్తానన్నారు కాబట్టి జిల్లావ్యాప్తంగా ఏదో ఒక నియోజకవర్గంలో తమ నాయకుడికి సీటు కేటాయించమంటూ సీఎంపై ఒత్తిడి తెస్తున్నారు. ఎంపీగా పోటీచేయాలనుకుంటున్నప్పటికీ ప్రస్తుతం నంద్యాల ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయన వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి పోచాను మార్చరు. కర్నూలు నుంచి సింగరి సంజీవ్ కుమార్ ఉన్నారు. సీటు దక్కడం అంత సులువేం కాదు. ముఖ్యమంత్రి జగన్ ఇవ్వాలనుకుంటేనే ఏదో ఒక నియోజకవర్గం ఖరారవుతుంది.2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నందికొట్కూరు లో ఎన్నికల ప్రచారంలో సిద్దార్థ ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మాట ఇచ్చారు.ఇచ్చిన మాటకు సిద్దార్థ కు రెండు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చారు. మరి సిద్దార్థ అభిమానులు కోరినట్లు వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఏ సీటు కేటాయిస్తారో అప్పటివరకు ఓర్పుగా ఎదురు చూడటమే.

About Author