‘మహమ్మదాబాద్’ను అభివృద్ధి చేస్తాం..
1 min read– రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్ : నూతనంగా మహమ్మదాబాద్ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారం నూతనంగా ఏర్పాటైన మండల తహసీల్దార్, ఎంఈఓ, ఏఓ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన మండల కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మండల కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నందున .. గండిడ్ నుంచి మహమ్మదాబాద్ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. మండలానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తీసుకొస్తామని, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పరిగి,తాండూరు లకు ఏ విధంగా సాగు నీరు తీసుకురావాలో శాసనసభ్యులతో కలిసి చర్చిస్తామన్నారు.
‘కోవిడ్’ పై అవగాహన కలిగి ఉండండి..
వ్యాధి నిరోధక శక్తి, మనోధైర్యం ఉన్న వారిని కోవిడ్ –19 వైరస్ ఏమీ చేయలేదని, ‘ కోవిడ్’ పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నూతన మండలానికి అవసరమైన మౌళిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.
30 ఏళ్ల కల నెరవేరింది.. ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి
మహమ్మదాబాద్ మండలం ఏర్పాటు చేయాలన్నది 30 సంవత్సరాల కల నేటితో నెరవేరిందన్నారు ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయం మేరకు చిన్న రాష్ట్ర లు,గ్రామలు, పంచాయతీలు, మండలాల ఏర్పాటు వల్ల ప్రజలకు పాలన సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. నూతన మండలంలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు.
మంత్రి చొరవతో… కలెక్టర్ ఎస్. వెంకటరావు
శాసన సభ్యులు, ఎక్సైజ్ శాఖ మంత్రి ఫలితంగా కొత్త మండలం సాధ్యమైందని, నూతన మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ పద్మశ్రీ, సర్పంచ్ పార్వతమ్మ, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ పి మాధవి, ఎంపీటీసీ చెన్నయ్య, లక్ష్మి, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.