శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు కలిసి పోరాడుదాం..
1 min read– నవంబరు 16 ఛలో విజయవాడకు తరలిరండి
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: రాయలసీమ సమస్యలను పరిష్కరించాలని, శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసేందుకు పాలకులపై ఒత్తిడి పెంచుదామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.గురువారం గోసుపాడు మండలం గోసుపాడు, యాళ్ళూరు, జిల్లెల్ల, కానాలపల్లె గ్రామాలలో రాయలసీమ కరువుకు కారణమైన పాలకుల నిర్లక్ష్యాన్ని, అధికారుల అలసత్వాన్ని వివరిస్తూ ఆయా గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…గత 90 ఏళ్ళుగా శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా పాలకులు రాయలసీమ కరువుకు కారణమయ్యారని ఆయన విమర్శించారు. రాజకీయ స్వార్థం వల్లే దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబడి వుందనీ,ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలుగు రాష్ట్రం సాధించుకున్నామనీ, వెనుకబడిన రాయలసీమ పట్ల వివక్ష జరగకుండా వుండటానికి ఆనాడు కోస్తా, రాయలసీమ నాయకుల మద్య జరిగిన ఒప్పందం శ్రీబాగ్ ఒడంబడిక అని వివరించారు. 1937 నవంబర్16 వ తేదీన శ్రీబాగ్ ఒడంబడిక జరిగినా నేటికి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే వుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కర్నూలులో ఏర్పడిందనీ అయితే తెలంగాణ ప్రాంతం 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రంలో చేరడంతో ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి కర్నూలులో వున్న రాజధానిని హైదరాబాదుకు తరలించారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి 2014 జూన్ 2 న తెలంగాణ విడిపోవడంతో 1953 అక్టోబర్ 1 న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రమే నేడు ఆంధ్రప్రదేశ్ గా కొనసాగుతోందని అన్నారు. అధికారంలో వున్న ప్రభుత్వం శ్రీబాగ్ ఒడంబడిక ను గౌరవిస్తున్నామంటూ కేవలం మాటలకే పరిమితమయిందని చట్టబద్దమైన హక్కులు ఉన్నా రాయలసీమ ప్రాజెక్టుల స్థిరీకరణకై గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అనుమతులు సాధించుకున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండా తెలంగాణా నీటి దోపిడీకి పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు. పాలనా వికేంద్రీకరణ అంటూ హైకోర్టు కర్నూలులో అంటూ ఊరిస్తూ ఆచరణలో అమలు చేయడం లేదని, న్యాయ రాజధానిలో భాగమై క్రిష్ణా పరీవాహక ప్రాంతమైన కర్నూలులో కాకుండా విశాఖపట్నం లో క్రిష్ణా యాజమాన్య బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడప ఉక్కు కర్మాగారం, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి వుందనీ, వెనుకబడిన రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహాలో ముప్పైవేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ, గుంతకల్లు లో రైల్వే జోన్ తదితర సమస్యలు పరిష్కరించకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పాలకులను ప్రశ్నిద్దామనీ వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టమని డిమాండ్ చేస్తూ శ్రీబాగ్ ఒడంబడిక దినోత్సవం నవంబర్ 16 న విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే రాయలసీమ సత్యాగ్రహ దీక్షకు అధిక సంఖ్యలో తరలిరావాలని దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశాలలో ఆయా గ్రామాల రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.