నేడు రైతులతో కలసి కలెక్టరేట్ ఎదుట ధర్నా
1 min read– ఎంపీ,ఎమ్మెల్యే పంట పొలాలను పరిశీలించకపోవడం బాధాకరం
పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: నష్టపోయిన పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని పత్తి రైతులు జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుడు పి.వెంకటేశ్వర్లు రైతులకు విజ్ఞప్తి చేశారు.రైతు సంఘం వినతి మేరకు మిడుతూరు మండల కేంద్రంలోని పత్తి రైతుల పొలాలను మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ పరిశీలించారు.ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాదాపు 15 రకాల కంపెనీలు నూజివీడు గోల్డ్ మైకో సిద్ధ జాదు సఫల అమర్ బయోటెక్ కార్గిల్ సీడ్స్ కబడి అకిరా శ్రీభాగ్య తదితర కంపెనీలు వేయడం వలన రైతులు పూతకాయ రాలిపోయి కనీసం ఎకరాకు ఒక క్వింటం కూడా దిగుబడి రావడం లేదన్నారు.నకిలీలకు అడ్డగా కల్తీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్న విత్తన కంపెనీల పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యేలు,ఎంపీలు రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా కనీసం రైతుల పొలాలను పరిశీలించకపోవడం బాధాకరమన్నారు.నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నకిలీ విత్తన కంపెనీలపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు.ఈరోజు జరిగే ధర్నా కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆంజనేయులు, కార్మిక సంఘం మండల కార్యదర్శి టి.ఓబులేష్,కెవిపిఎస్ మండల నాయకులు లింగస్వామి,రైతులు జయ రాముడు,ఏసన్న,సురేష్,మహానంది,లాజర్ తదితరులు పాల్గొన్నారు.