PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సర్వసభ్య సమావేశంలో ” ప్రోటోకాల్ రగడ”

1 min read

– అధికారుల పై ఎంపీపీ ,సర్పంచులు ఆగ్రహం
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: అధికారులు ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదంటూ, గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ అధికారుల తీరుపై ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశము ఏర్పాటు నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ అన్ని శాఖలు మరియు అంశాల వారీగా అధికారులతో ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ గ్రామస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా విధులను నిర్వహించాలని సూచించారు.అనంతరం సమావేశంలో డిఆర్డీఏ వెలుగు సిబ్బంది ప్రగతి నివేదికలను వివరిస్తుండగా ఎంపీపీ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు ఫ్రోటో కాల్‌ ‌పాటించకుండా ఎంపిటిసిలకు, సర్పంచులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెలుగు సిబ్బందికి అధికారులంటే లెక్కలేదా అంటూ ఆగ్రహం చెందారు.కోనేటమ్మ పల్లి గ్రామంలో పొదుపు సంఘం లో మాయమైన రూ.2 లక్షలు ఏమైందో వెలుగు సిబ్బంది తేల్చుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు .గ్రామాలలో ఉన్నటు వంటి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం కలిగిన ఉండాలన్నారు. గతంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో చర్చించిన సమస్యలు ఇంతవరకు కూడా పరిష్కారం కాకపోవడం పట్ల ఎంపిటిసిలు, సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో జరిగే కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలతో ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని, అలాంటప్పుడు ఎంపిటిసిలు, సర్పంచులు ఎందుకని పలువురు సభ్యులు అధికారులపై విరుచుకుపడ్డారు . ప్రజాప్రతినిధులకు అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, దీని కారణంగా సర్పంచులు హాజరు కాకపోవడం వలన సమస్యలు ఎలా తెలుస్తాయనీ, ఆయా గ్రామాల సమస్యలు ఎలా పరిష్కారం జరుగుతాయనీ ధ్వజమెత్తారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ ,గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరించి ముందుకెళ్లాలని హితవు పలికారు.మండల వ్యవసాయ అధికారిణి శ్రావణి మాట్లాడుతూ మండలం లో 6126 మంది రైతులు ఉండగా 5446 మంది ఈ కేవైసీ నమోదు చేసుకున్నారని మిగిలిన 680 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలన్నారు. నందికొట్కూరు నుండి అల్లూరు గ్రామం వరకు బిటి రోడ్డు నిర్మాణం కోసం రూ.65 లక్షలు మంజూరు కావడంతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నామని ఏఈ మనోజర్ వెల్లడించారు. రహదారిపై గోతులు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఎంపీపీ పేర్కొన్నారు. గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ఏఈ రాము నాయక్ కు తెలిపారు.కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు పబ్బతి జ్యోతి, ఎంపీడీఓ శోభారాణి, డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి, సీడీపీఓ కోటేశ్వరి, మండల విద్యాశాఖ అధికారిణి ఫైజున్నిసా బేగం, ఏపీఓ అలివేలు మంగమ్మ, కొనిదేల పశువైద్యాధికారి రవికుమార్ రెడ్డి,ఈఓ ఆర్డీ సుభ్రమణ్యం శర్మ ,సర్పంచులు రవి యాదవ్, మాధవరం సుశీలమ్మ, మరియమ్మ, వివిధ శాఖ ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About Author