గంగానదిలో శవాలు.. ఏమిటీ వైపరీత్యం..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన కారణంగా ఎన్నడూలేని దారుణ పరిస్థితుల్ని దేశ ప్రజానీకం ఎదుర్కొంటోంది. వినడమే తప్ప.. ఎప్పుడూ చూడని దృశ్యాల్ని చూడాల్సి వస్తోంది. హృదయ విదారక ఘటనలు.. నిలువెత్తు మనిషి గజగజ వణికిపోయే దృశ్యాలు కరోన కాలంలో ఎదురవుతున్నాయి. ఎప్పుడు ఎవరి చావు చూడాల్సి వస్తోందో.. ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయం ప్రజల్లో నెలకొంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన ఘటన ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. వందేళ్ల క్రితం .. వైద్య సదుపాయాలు లేని సమయంలో ఎదుర్కొన్న ఘటనలు .. నూతన సాంకేతిక వైపు పరుగులు పెడుతున్న నేటి సందర్భంలో ఎదురవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గంగానది అంటే పవిత్రతకు మారుపేరు. ఆ గంగా జలం పొందితే ఆజన్మ పుణ్యఫలం సిద్ధిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. అలాంటి గంగానదిలో వందల కొద్ది జనం విగతజీవులై కొట్టుకు వస్తుంటే.. అది చూసిన జనం బెంబేలెత్తారు. బిహార్ లోని బక్సర్ జిల్లా చౌసా లో ఈ ఘటన జరిగింది. చౌసాలోని మహదేవ్ ఘాట్ కు 40 నుంచి 50 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ మృతదేహాలన్నీ ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకువచ్చి ఉంటాయని స్థానిక అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించలేని వాళ్లు గంగా నదిలో వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ జిల్లాలో పలు ఘాట్ ల వద్ద మృతదేహాలు నీటిపై తేలియాడుతున్నాయి. ఇవన్నీ కూడ ప్రొటోకాల్ ప్రకారం చుట్టి ఉన్నాయి. కోవిడ ప్రోటోకాల్ ప్రకారం శవాలు చుట్టి ఉండటంతో … ఇవి కరోన మృతదేహాలని అధికారలు భావిస్తున్నారు. ఈ మృతదేహాలు సుమారు 80 వరకు ఉండొచ్చని అధికారుల అంచన.