జగన్ రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయి
1 min read– టి.డి.పి నేతలు గన్ని,బడేటి హెచ్చరిక.. అయ్యన్న అరెస్టుకు నిరసనగా భారీ ఆందోళన
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: టి.డి.పి లో ప్రజాదరణ ఉన్న నేతలను అక్రమంగా అరెస్టు చేయించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జి బడేటి చంటి ధ్వజమెత్తారు. మాజీమంత్రి, టి.డి.పి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఏలూరు టి.డి.పి ఇంఛార్జి బడేటి చంటి సారధ్యంలో ఆశ్రం మెడికల్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ డౌన్ డౌన్ అంటూ టి.డి.పి కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు అరెస్ట్ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అయ్యన్నపాత్రుడు ఎత్తి చూపారన్న అక్కసుతో సి.ఐ. డి పోలీసులు ఆయన్ని వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో చీకటి పాలన సాగుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. హత్యలు, రేపులు చేస్తున్నవారిని పట్టించుకోని పోలీసులు ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జగన్ రెడ్డి అవినీతి ని ఎండగడుతున్నారన్న అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు పై పాలకులు కక్ష గట్టారని వారు ఆరోపించారు. ఉత్తరాంధ్ర వై.సి.పి నాయకులు మూడు రాజధానుల పేరుతో ఆడుతున్న నాటకాలను అడ్డుకుంటు ఒక్కటే రాజధాని నినాదాన్ని ప్రజల వద్దకు బలంగా తీసుకువెళ్లడంలో అయ్యన్నపాత్రుడు ప్రముఖ పాత్ర పోషించడంతో ఆయన కుటుంబంపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా చీకటి దారుణాలను ముఖ్యమంత్రి ప్రోత్సహించడం దుర్మార్గమని వారు మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించేవారి గొంతు నొక్కాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని,రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వారు హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు ను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.