వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి 414 జయంతి ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : పట్టణంలో కాలజ్ఞాని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 414వ జయంతి ఉత్సవాలు బనగానపల్లి పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 15వ శతాబ్దంలో తన తొమ్మిదేళ్ల వయసులో బనగానపల్లెకు వచ్చి గరిమిరెడ్డి అచ్చమాంబ ఇంట్లో పశువులకాపరిగా చేరి యుక్తవయసు వచ్చేంతవరకు ఇక్కడే నివాసమున్నాడు. అవుల మందను సమీపంలోని రవ్వలకొండపైకి తీసుకువెళ్లి అక్కడే ఒక గుహలో కాలజ్ఞానం రచించారు. అందుకే బనగానపల్లె బ్రహ్మంగారు నడయాడిన ప్రసిద్ధ పుణ్యస్థలిగా వాసికెక్కింది. బ్రహ్మంగారు ఇక్కడ నివాసముండి కాలజ్ఞానం రచించిడమేకాక తాను కందిమల్లయ్య పల్లె వెళ్ళేప్పుడు ఇక్కడ జుర్రేరు వడ్డున ఒక శివలింగ ప్రతిష్ట చేసారు. ప్రస్తుతం ఆ ప్రాంతం నేలమఠంగాను, ఆయన నివాసమున్న స్థలం ఆచ్చమాంబ మఠంగా ప్రసిద్ధి పొందాయి. ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మంగారి ఆరాధన , జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శనివారం 414 జయంతి సందర్భంగా నెలమఠం, చింతమాని మఠంలలో ఆలయ అర్చకులు శ్రీనివాసచారి, చిరంజీవి ఆచారిల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన వితరణ గావించారు.