క్షేత్రస్థాయిలో ఆపదమిత్ర వాలంటీర్లు సిద్ధం
1 min read– పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: జిల్లాల్లో విపత్తుల వలన కలిగేనష్టాలను నివారించేందుకు క్షేత్రస్థాయిలో ఆపదమిత్ర వాలంటీర్లను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్ధ (ఎపిఎస్ఐఆర్డిపిఆర్) డైరెక్టర్ జె. మురళి అన్నారు. సోమవారం ఏలూరు జె.వి.ఆర్. నగర్ లోని సోషల్ సర్వీస్ సెంటర్ లో జిల్లా పంచాయితీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని ఎపిఎస్ఐఆర్డిపిఆర్ డైరెక్టర్ జె. మురళి,పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆపదమిత్ర కరదీపికను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి ఆయన ఆవిష్కరించారుఈ సందర్బంగా ఎపిఎస్ఐఆర్డిపిఆర్ జె.మురళి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో కమ్యూనిటీ ఆధారిత సన్నద్ధత, ప్రణాళిక ప్రమాదం యొక్క ప్రభావాలను తగ్గించడానికి, సహాయం అందించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు.ఏ విపత్తు సంభవించినా ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు కమ్యూనిటీ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు.విపత్తులు సంభవించిన సమయంలో తక్షణం స్పందించేలా ముఖ్యంగా తుఫాను,వరద ప్రభావిత మండలాలు, గ్రామాల్లో ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపదమిత్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాలకు చెందిన 5400 మంది ఆపదమిత్ర కార్యకర్తలకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా పశ్శిమ గోదావరి జిల్లాలోని 5 మండలాలకు చెందిన 100 మందికి 12 రోజులు పాటు సమగ్ర శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.శిక్షణా కార్యక్రమంలో బాగంగా తొలి 10 రోజులు శిక్షణ అందించడంతోపాటు మిగిలిన 2 రోజులు తుఫాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయిలో మాక్ డ్రిల్ నిర్వహించి అవసరమైన శిక్షణ అందించబడుతుందన్నారు.శిక్షణ అనంతరం ఆపదమిత్ర కార్యకర్తలకు విపత్తు సంసిధ్దత కిట్అందించబడుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు విపత్తుల ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల ప్రజలకు తగిన ప్రాధమిక అవగాహన కల్పించేందుకు ఆపదమిత్ర శిక్షణ తరగతులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. విపత్తుల వలన ప్రాణ నష్టం తో పాటు వ్యవసాయం,ఆస్తి నష్టం, పశుసంపదనష్టం,పర్యావరణం,జీవవైవిధ్యం దెబ్బతినటం వంటి అనేకనష్టాలు వాటిల్లటం సహజంగా జరుగుతుందని అన్నారు.జాతీయ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళాలు దూరంగా ఉన్నందున విపత్తులు జరిగే ప్రాంతాలకు చేరుకోవటానికి సమయము పడుతుందని ఈ లోగా స్థానికంగా అందుబాటులో ఉన్న ఆపద మిత్ర వాలంటీర్లు విపత్తుల సంబవించే ప్రాంతాలకు చేరుకొని ప్రజలను అప్రమత్తం చేయటంలోను ప్రజలను రక్షించే పనులలో ఉంటారని తెలిపారు. తూఫానులు,వరదలు, భూకంపాలు,కొండచరియలు విరిగి పడడం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆస్థి, ప్రాణ నష్టాల నివారణకు ప్రభుత్వంతోపాటు,స్వచ్చంద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తుంటాయని,అయితే ఆయా సంస్థలు వచ్చేలోపే స్థానికంగా ఉండే యువతకు విపత్తు నిర్వహణలో అత్యవసర సేవలందించడంలో శిక్షణ అందించి ప్రాణ నష్టం జరగకుండా నివారించాలన్నది ‘ఆపదమిత్ర’ కార్యక్రమం యొక్క ప్రధానోద్దేశ్యమన్నారు. ‘ఆపదమిత్ర’ కార్యకర్తలకు భీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ‘ఆపదమిత్ర’ కార్యక్రమం నిర్వహణకు జిల్లా,మండల స్థాయిలలో నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు.ఆపదమిత్ర’ కార్యక్రమం ద్వారా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, ఆస్థి, ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. జిల్లా ప్రజాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి కె.వి.ఎస్.ఆర్.రవి కుమార్ మాట్లాడుతూ నవంబరు 7వ తేదీ సోమవారం నుండి 18 వ తేదీ వరకు 12 రోజులు పాటు యలమంచిలి,అచంట, నరసాపురం,ఆకివీడు, పెంటపాడు మండలా లకు సంబందించిన100 మంది ఆపదమిత్ర వాలంటీర్లకు ఏలూరులోని సోషల్ సర్వీస్ సొసైటీ ట్రైనింగ్ సెంటర్ నందు రెసిడెన్సియల్ పద్ధతిలో శిక్షణ తరగతులునిర్వహిస్తున్నా మన్నారు.విపత్తుల వలన వాటిల్లే ప్రాణ నష్టం,ఆస్తి నష్టం,జీవనోపాధి,ఆరోగ్యం, సామాజిక,ఆర్ధిక,బౌతిక, పర్యావ రణ వంటి నష్టాలను తగ్గించుకునేందుకు గ్రామ స్థాయిలోని ప్రజలనుండే నైపుణ్యం గల బలగాలను సిద్ధం చేయడమే ఆపదమిత్ర శిక్షణ ఉద్ధేశ్యమని పేర్కొన్నారు. వరదలు,తుఫానులు,కరువు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు,వంటి పెను విపత్తులు పై సరైన అవగాహన,అవసరమైన జ్ఞానం ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ ద్వారా వివిద ప్రభుత్వ శాఖల అధికారుల ద్వారా నేర్పించడం జరుగుతుందన్నారు.సమావేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిటిఎం జి. ప్రసంగిరాజు,డిపిఎం రత్నబాబు,ప్రభృతులు పాల్గొన్నారు.