సూర్య కుమార్ యాదవ్ ఏం తింటాడంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : పరిమిత ఓవర్ల క్రికెట్ లో ముఖ్యంగా టీ20 క్రికెట్ లో విశ్వరూపం ప్రదర్శిస్తున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా బరిలో దిగే సూర్య ధాటికి బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ దూకుడు వీర లెవల్లో కొనసాగుతోంది. ప్రముఖ డైటీషియన్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్టు శ్వేతా భాటియా గత ఏడాదికాలంగా సూర్యకుమార్ యాదవ్ డైట్ మెనూ పర్యవేక్షిస్తున్నారు. సూర్య తీసుకునే ఆహారం గురించి ఆమె ఆసక్తికర వివరాలు పంచుకున్నారు. అతడిలో చురుకుదనం పాళ్లను పెంచేందుకు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని మెను నుంచి తొలగించాం. ఏ స్థాయిలో కార్బోహైడ్రేట్లు అవసరమో అంత మేరకే అందిస్తున్నాం. నట్స్, ఒమెగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఉండే ఆహారమే అతడి మెనూలో ఉంటుంది. ఇక అధిక ప్రొటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలు తీసుకుంటాడు. పాలు, పాల ఉత్పత్తులు, పీచుపదార్థం రూపంలో లభ్యమయ్యే తక్కువ మోతాదు కార్బోహైడ్రేట్లు, కూరగాయలు తన మెనూలో ఉండేలా చూశాం. శరీరం ఎప్పుడూ ఉత్తేజంతో ఉండేందుకు కాఫీ కూడా మెనూలో ఉంటుంది. కాఫీలో ఉండే కెఫీన్ శరీరానికి హుషారునిస్తుంది.
ఇక, డిన్నర్ తర్వాత గానీ, లేక పిజ్జా, మటన్ బిర్యానీ తిన్న తర్వాత గానీ ఓ ఐస్ క్రీమ్ లాగించడం వంటి పనులకు సూర్య చాలా దూరంగా ఉంటాడు. అతడు చాలా ప్రొఫెషనల్ మైండ్ సెట్ ఉన్నవాడు. తన ఆట కంటే ఏదీ ముఖ్యం కాదని భావిస్తాడు. అందుకే ఎలాంటి జంక్ ఫుడ్ జోలికి వెళ్లడు. మేం డైట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి అతడు వేరే ఆహారాన్ని తీసుకోవడం ఇంతవరకు చూడలేదు” అని శ్వేతా భాటియా వివరించారు.