సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ డిమాండ్ చేశారు. 15 శాతం జనాభా ఉండి ఎనభై శాతం పదవులు పొందుతున్న అగ్రకులాలకి రిజర్వేషన్లు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోను నరేష్ మాట్లాడారు. అగ్ర కులాల్లోని పేదలకు ఆర్థిక పరమైన స్కీములు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, ఆర్థిక అభివృద్ధి పథకం అంతకంటే కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి తమతమ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, అధికార పదవులలో వాటా ఇవ్వాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఇది రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. 15% జనాభా ఉండి 80% పదవులు పొందుతున్న ఓ.సి.లకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించారు. దేశ సంపదలో 90% అగ్రకులాలదే. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఐదుగురితో ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కుడా విభిన్న వాఖ్యలు చేశారన్నారు. బిసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఇప్పటికే ఈడబ్ల్యూఎన్ రిజర్వేషన్లుపై ఇచ్చిన తీర్పుపై తన అసంతృప్తి వెల్లబుచ్చారని దీనిపై సుప్రీం కోర్టు పుల్ బెంచ్ విచారణ చేయాలని కోరారన్నారు. అంతే కాకుండా తాము రివ్యూ పిటీషను దాఖలు చేస్తాం. గతంలో మండల కమీషను సందర్భంగా 9 మంది జడ్జీలు రాజ్యాంగ ధర్మాసనం 50% రిజర్వేషన్లు ఉండవలసినది 60% ఉంటే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారన్నారు. 11 మంది తో ఉన్న రాజ్యంగ ధర్మాసనం మాత్రమే విచారణ చేయవలసి ఉందని వెంటనే పునః సమీక్షించి తీర్పు ఇవ్వాలని డిమాండు చేశారు. 1986లో మురళీధరరావు కమీషను సిఫారసు మేరకు అప్పటి టి.డి.పి. ప్రభుత్వం ఎన్టీఆర్ హయాంలో బి.సి.లకు 44% రిజర్వేషను కల్పించింది. కాని హైకోర్టు 50% సీలింగు దాటుతుంది అనే సాకుతో దాని అమలును నిలిపివేసిందన్నారు. ప్రస్తుతం 50% సీలింగు సమస్య నేడు లేదు కాబట్టి మరల మురళీధరరావు కమీషను సిఫార్సుల అమలు కొరకు ప్రతి బి.సి ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు లక్ష్మణ్, యువజన నగర అధ్యక్షులు పి.సాయికిరణ్, నగర మహిళా అధ్యక్షరాలు మెండెం జ్యోతి, ఎమ్. ప్రసాద్, ఆర్. రామకృష్ణ, టి. శంకర్, బి. నాగుర్, సాహేరా, జయలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.