‘ కోవిడ్’కు జిల్లాలోనే మెరుగైన వైద్యం..
1 min read500 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేయండి..
– వైద్యాధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా వైద్యాధికారులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వారం రోజుల్లో 500 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని, మరో నాలుగు ఆర్టీపీసీ ఆర్ ఆటో మిషన్‌ను ప్రారంభిస్తామన్నారు. నారాయణపేటలో నెలకొన్న ఆక్సిజన్ సమస్యను వెంటనే పరిష్కరించామని, మహబూబ్‌నగర్ నుంచి వైద్యులను ఉప నియామకం చేపట్టామన్నారు. 200కు పైగా నర్సులను, ల్యాబ్ టెక్నిషియన్ జిల్లా జనరల్ ఆస్పత్రికి, 12 మంది వైద్యులను గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు ఇటీవలె నియమించామని వెల్లడించారు. జిల్లాలో 3వేల రెమిడిసివర్ ఇంజక్షన్లను సిద్ధంగా ఉంచామని, ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ ఆస్పత్రల్లోనూ బెడ్లు ఉన్నాయన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.