ఉరి శిక్షకు ఏడుసార్లు ఆదేశాలు వచ్చాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : రాజీవ్ గాంధీ హత్య కేసులో తన ప్రమేయం ఏమీలేదని నళిని శ్రీహరన్ మరోమారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ హత్య కేసు దోషులంతా జైలు నుంచి బయటపడిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా ఆదివారం నళిని మీడియాతో మాట్లాడారు. జైలు జీవితం గురించి, ప్రియాంక గాంధీ తనను కలవడం గురించి వివరాలను పంచుకున్నారు. తన భర్త శ్రీహరన్ స్నేహితులతో తిరిగిన మాట వాస్తవమే అయినా వాళ్ల కుట్రలో తనకు సంబంధంలేదని వివరించారు. కోర్టు తనను దోషిగా నిర్ధారించి, ఉరిశిక్ష వేశాక క్షణక్షణం భయంగా బతికానని నళిని తెలిపారు. ఉరిశిక్ష అమలుకు ఏడుసార్లు వారెంట్ అందిందని, ఇంతటితో తన జీవితం ముగిసిందని భయాందోళనలకు గురయ్యానని చెప్పారు. ‘కోర్టు నన్ను దోషిగా తేల్చింది కానీ హత్య కుట్రతో నాకు సంబంధంలేదు.. నిజమేమిటో నా అంతరాత్మకు తెలుసు’ అని నళిని వ్యాఖ్యానించారు. 2001 లో ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేంత వరకు భయంభయంగానే బతికానని చెప్పారు.