PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ‘ సీఓపీడీ’ వ్యాధిపై అవగాహన అవసరం

1 min read

– డా. నాగార్జున వి. మాటూరు

హైదరాబాద్: ప్రతి సంవత్సరం, ప్రపంచ క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) దినోత్సవం నవంబర్ నెలలో 3వ బుధవారం నాడు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సీఓపీడీ గురించి అవగాహన పెంపొందించడానికి, జ్ఞానాన్ని పంచడానికి, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సమర్థించడానికి, సీఓపీడీ భారాన్ని తగ్గించే మార్గాలను చర్చించడానికి ఇది జరుగుతుంది. ఈ సంవత్సరం, ప్రపంచ సీఓపీడీ దినోత్సవం కోసం గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ (జీఓఎల్‌డీ) ద్వారా ఎంచుకున్న థీమ్ “యువర్ లంగ్స్ ఫర్ లైఫ్”. ఈ థీమ్ సాధారణంగా జీవితకాల ఊపిరితిత్తుల ఆరోగ్య ప్రాముఖ్యతను, ముఖ్యంగా సీఓపీడీ గురించి ప్రధానంగా చర్చిస్తుంది. మనమందరం ఒక్క జత ఊపిరితిత్తులతోనే పుడతాం. అభివృద్ధి చెందే దశ నుంచి యుక్తవయస్సు వరకు, ఊపిరితిత్తులను బలంగా, ఆరోగ్యంగా ఉంచడం అనేది భవిష్యత్తు ఆరోగ్యం, శ్రేయస్సులో ఒక ప్రాథమిక భాగం.

‘సీఓపీడీ’ని.. త్వరగా గుర్తించాలి..:

ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని యశోద ఆసుపత్రికి చెందిన  క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వెంకట నాగార్జున మాటూరు మాట్లాడుతూ, “సీఓపీడీ అనేది ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల వచ్చే ఒక వ్యాధి, ఇది సాధారణంగా సిగరెట్ పొగ వల్ల వస్తుంది. వాయుమార్గాలకు ఇలా జరిగే నష్టం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, అలసటకు దారితీస్తుంది. దానికితోడు, సీఓపీడీ ఉన్న రోగులు ఛాతీ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. అత్యంత సాధారణ సీఓపీడీ లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కఫం రావడం, దగ్గు. ఈ లక్షణాలను మొదట్లో రోగులు అంతగా పట్టించుకోరు, దానివల్ల సీఓపీడీని గుర్తించడం ఆలస్యం అవుతుంది” అన్నారు.

కాలుష్యం.. పోషకాహారలోపం..:

ప్రపంచవ్యాప్తంగా, 391 మిలియన్ల మంది ప్రజలు ప్రస్తుతం సీఓపీడీతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా, మరణాలకి సీఓపీడీ మూడో ప్రధాన కారణం కాగా, భారతదేశంలో మరణాలకి ఇది రెండో ప్రధాన కారణం. ధూమపానం సీఓపీడీకి అత్యంత సాధారణ కారణం అయితే, భారతదేశంలో ధూమపానం చేయని వారిలోనూ సీఓపీడీ వస్తోంది. గది లోపల, బయట ఉండే వాయు కాలుష్యం ఇప్పుడు సీఓపీడీ అభివృద్ధికి ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా నిర్ధారణ అవుతోంది. నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించడం వల్ల సీఓపీడీ ఎక్కువగా వస్తోంది.  వివిధ రసాయనాలు, ధూళికి గురికావడం కూడా సీఓపీడీకి దారితీస్తుంది. అలాగే, ఇంట్లో ఉపయోగించే దోమలు చంపే కాయిల్స్ వంటి సాధారణంగా ఉపయోగించే వస్తువులు సీఓపీడీకి కారణమవుతాయి. రాత్రిపూట ఇవి వాడటం అనేది.. 100 సిగరెట్లు కలిపి తాగడానికి సమానం అని కనుగొన్నారు. కాలుష్యం, పోషకాహార లోపం లేదా ఊపిరితిత్తుల వ్యాధులకు గురికావడం, బాల్యంలో ఊపిరితిత్తులు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం కూడా యుక్తవయస్సు ప్రారంభంలోనే సీఓపీడీ రావడానికి దారితీస్తుంది.

చేసే పనితోనూ…సీఓపీడీ ప్రభావం..:

సీఓపీడీ అనేది ఊపిరితిత్తుల విషయంలో నయం చేయలేని వ్యాధి. ఇది ఒక బలహీనపరిచే పరిస్థితి. ఇది ఊపిరితిత్తుల నుంచి గాలి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. తద్వారా రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. సీఓపీడీ రోగి, వారి కుటుంబాలు, వృత్తిపరమైన జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఏ లక్షణాలు తమను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి, అవి ఎంత తీవ్రంగా ఉన్నాయి, వారి ఊపిరితిత్తులు ఎంత దెబ్బతిన్నాయనే లక్షణాల ఆధారంగా ప్రజలు తమకున్న సీఓపీడీ తీవ్రతను గురించి తెలుసుకోవచ్చు.  సీఓపీడీ అనేది నెమ్మదిగా పెరిగే వ్యాధి. దీర్ఘకాలిక లక్షణాలు బయటపడటానికి ముందు లోపల్లోపలే ఊపిరితిత్తుల నష్టం ఒక స్థాయికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.

మెరుగైన జీవితం కోసం… చిట్కా..:

 సీఓపీడీకి చికిత్స లేకపోయినా, రోగులు తమకున్న లక్షణాలకు చికిత్స పొందడానికి, వ్యాధి తీవ్రతను నెమ్మదింపజేయడానికి, తద్వారా వారు బాగా జీవించేలా చేయడానికి కొన్ని సాధనాలు, చిట్కాలు ఉన్నాయి. “పీల్చే మందులు వాడుతూ క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం, ధూమపానం మానేయడం, ఊపిరితిత్తుల పునరావాసం, సమతుల్య ఆహారం తీసుకుంటూ, నిరంతరం వ్యాయామం చేయడం వంటి సమగ్ర విధానాలు పాటిస్తే, సీఓపీడీ ఉన్నా, నాణ్యమైన జీవనం గడిపే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల గురించిన అవగాహన విషయంలో ఇప్పుడున్న అంతరాన్ని భర్తీ చేయడానికి చాలామందికి సరైన సమాచారం అందుబాటులో లేదు,” అని డాక్టర్ మాటురు అన్నారు.

About Author