NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రముఖ కార్డియాలజిస్ట్​ డా. పి.చంద్రశేఖర్​కు వరించిన గోల్డ్​ మెడల్​

గవర్నర్​ చేతుల మీదుగా అందుకున్న అడిషనల్​ డీఎంఈ

పల్లెవెలుగు వెబ్​:రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులోని  సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు విశిష్ట సేవలు అందించిన కార్డియాలజిస్ట్​ , అడిషనల్​ డీఎంఈ డా. చంద్రశేఖర్​కు అరుదైన గౌరవం దక్కింది. 2019లో  కర్నూలు జిల్లా ఇండియన్​ రెడ్​ క్రాస్​ సొసైటీలో అత్యధికంగా మెంబర్స్​ ను చేర్పించడం.. యువతతో రక్తదానం చేయించడం… అవగాహన కల్పించడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో సఫలమైన డా. చంద్రశేఖర్​కు బంగారు పతకం వరించింది.  సేవలకు గుర్తింపుగా సోమవారం గవర్నర్​ ఆఫీస్​ రాజభవన్​ దర్బార్​ హాల్​ నందు ప్రభుత్వ వైద్యశాల కార్డియాలజిస్ట్​, అడిషనల్​ డీఎంఈ డా.పి. చంద్రశేఖర్​ .. రాష్ట్ర గవర్నర్​  విశ్వభూషణ్​ హరిచందన్​ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు.

ఫలించిన కృషి.. : కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో 25 ఏళ్లుగా గుండె వైద్యనిపుణులుగా పని చేసి.. లక్షల మందికి ప్రాణదాతగా నిలిచిన  కార్డియాలజిస్ట్​, అడిషనల్​ డీఎంఈ డా. పి. చంద్రశేఖర్​ను జూనియర్​, సీనియర్​ వైద్యులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనహృదయాలను అర్థం చేసుకుని..వైద్యచికిత్సలు అందించే మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. రాయలసీమలోనే కాక తెలంగాణలోని మహబూబ్​నగర్​ , కర్ణాటకలోని రాయచూరు జిల్లా వాసుల మదిలో నిలిచిన డా. పి. చంద్రశేఖర్​కు రాష్ట్ర గవర్నర్​ విశ్వభూషణ్​ చేతుల మీదుగా బంగారు పతకం అందుకోవడం సంతోషంగా ఉందని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వర్తింపజేయడంలో ముందుండే డా. చంద్రశేఖర్​….వైద్యసేవలు చేస్తూ… మరెన్నో పతకాలు సాధించాలని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆకాంక్షించారు.

సక్సెస్​కు కేరాఫ్​…డా. చంద్రశేఖర్​ : డా. కె.జి. గోవింద రెడ్డి

కర్నూలు జిల్లా  ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ అభివృద్ధికి విశేష కృషి చేసిన కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​.. ప్రజలకు అత్యవసర సమయంలో రక్తదానం చేయించడంలో విజయం సాధించారని కర్నూలు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తెలిపారు. రెడ్​ క్రాస్​ సొసైటీ సేవలు గుర్తించి డా. చంద్రశేఖర్​కు రాష్ట్ర గవర్నర్​ విశ్వభూషణ్​ బంగారు పతకం అందజేయడం అభినందనీయమన్న డా. గోవింద రెడ్డి… కర్నూలు ప్రభుత్వ వైద్యశాలను మరోసారి రాష్ట్ర చరిత్రలో నిలిపారని కొనియాడారు.

 బాధ్యత… పెరిగింది…:డా. చంద్రశేఖర్​       

కర్నూలు రెడ్​ క్రాస్​ సొసైటీలో అత్యధికంగా మెంబర్​ను చేర్పించడం… యువతతో రక్తదానం చేయించడం… ప్రజలకు అవగాహన కల్పించడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వర్తింపజేసినందుకుగాను రాష్ట్ర గవర్నర్​ విశ్వభూషణ్​ హరిచందన్​ చేతుల మీదుగా బంగారు పతకం అందుకోవడం సంతోషంగా ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించే నాకు.. దేవుడి ఆశీర్వాదం మెండుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి… కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు మరింత మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. అందరి సహకారంతో మరింత సేవ చేస్తా.

About Author