శరణ బసవేశ్వరుడు.. ఓ రాజ్యాధినేత
1 min readమంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్ : బహుజన వర్గాలను రాజ్యాధికారానికి చేరువ చేసిన మొట్టమొదటి దార్శనికుడు శరణ బసవేశ్వరడని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో గల శరణ బసవేశ్వరుడి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించడానికి మనుషులందరూ ఈశ్వరుడి దృష్టిలో సమానమేనని వీరశైవ లింగాయత్ ధర్మాన్ని స్థాపించి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయడమే కాకుండా కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఎంతో శ్రమించినట్లు తెలిపారు. నిమ్న వర్గాలు రాజ్యాధికారానికి అనర్హులనే జడత్వ భావన నాటి సమాజంలో రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో శరణు బసవేశ్వరుడు ఒక రాజ్యాధినేత గా తన మంత్రివర్గంలో అనుభవ మంటపం పేరుతో అన్ని కులాల వారికి స్థానం కల్పించి శతాబ్దాల కిందటే సమసమాజ స్థాపన కోసం కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శరణు బసవేశ్వరుడి ఆశయ సాధన కోసం కంకణబద్ధులై ఉన్నట్లు మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు పాల్గొన్నారు.