శ్రీ లలితా సహస్రనామ కోటి పారాయణ మహాయజ్ఞం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కల్లూరు లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు సద్గురు భానుమతమ్మ గారి ఆశీస్సులతో వారి శిష్యులు పుస్తేపల్లి విజయలక్ష్మీ పుల్లయ్య దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ కోటి పారాయణ మహాయజ్ఞం అత్యంత వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమానికి కేవలం నగరంలోని భక్తులే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి హాజరైన మాతృమూర్తులచే ఈ పారాయణ మహాయజ్ఞం జరిగినది.
అందరినీ కలిపి ఉంచేది ధర్మమే టి.జి.భరత్ : యువ పారిశ్రామికవేత్త, మరియు తె.దే.పా.నియోజకవర్గ బాధ్యులు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ బాధ్యులు టి.జి.భరత్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలను కలిపిఉంచేది ధర్మం మాత్రమేనని అటువంటి ధర్మకార్యాలు చేయడం ఎంతో అభినందనీయమని సమాజంలో ఇటువంటి వారిని ఆదరించి అభినందించాలని పిలుపునిచ్చారు. ముఖ్య వక్తగా విచ్చేసిన సద్గురువు భానుమతమ్మ మాట్లాడుతూ మనలో నిద్రాణమై ఉన్న దైవీశక్తులను జాగృతం చేయడమే మానవ జీవితానికి పరమార్థమని, ఈ నాటి సమాజం అర్థం వెంటపడి పరమార్ధాన్ని మరచిపోతున్నదని ధార్మిక శక్తియే ప్రపంచానికి శాంతి సుస్థిరతలు అందించగలవని చాటారు. ఈ కార్యక్రమంలో లలితా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ, లలితా పీఠం పీఠాధిపతులు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, అమ్మవారి శాల ప్రెసిడెంట్ రాజశేఖర్, ఎస్.రమేష్, సుకన్య, లక్ష్మీ ,హరిప్రియ, రమేశ్, శ్రీను, టి వేదవతి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.కార్యక్రమ నిర్వాహకులు పుస్తేపల్లి విజయలక్ష్మీ పుల్లయ్య దంపతులు లలితా సహస్రనామ పారాయణ బృందాలతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.