పశువైద్యాధికారుల నిర్లక్ష్యం..
1 min read– లంపి వైరస్ వ్యాధితో కోడేదూడ మృతి..
– రూ. 1.50 లక్షలు రైతుకు నష్టం… లబోదిబోమంటున్న రైతు సాంబశివుడు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన పబ్బతి సాంబశివుడు అనే రైతుకు చెందిన ఒంగోలు జాతి కోడెదూడ ముద్ద చర్మం అనే వ్యాధితో మంగళవారం చనిపోగా బుధవారం మరో ఎద్దు అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో రైతు వాపోతూ అధికారుల నిర్లక్ష్యంతోనే లక్షా 50 వేల రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముద్ద చర్మ వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో గ్రామంలో స్థానిక పశు వైద్యాధి అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరించడంతో రైతు తమకు నష్టం వాటిలిందన్నారు. గ్రామంలో స్థానికంగా ఉండి ఇలాంటి వ్యాధుల పట్ల రైతులకు అవగాహన కల్పించి పశువులను స్వయంగా పరిశీలించి చికిత్సలు చేయవలసిన అధికారులే సెలవులలో వెళ్లడంతో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. నియోజవర్గంలో ముద్ద చర్మ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్నప్పటికీ అరికట్టవలసిన పశువైద్యాధికారులు వ్యాధిని గుర్తించడంలో విఫలమైనట్లు రైతు తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. విలేకరులు జరిగిన సంఘటనపై స్థానిక పశువైద్య సిబ్బందిని వివరణ కోరగా స్థానిక పశువైద్యాధికారిణి సెలవులో ఉన్నారని ఇంచార్జ్ మాత్రం ఎవరో తనకు తెలియదు అనడం గమనార్హం.!