గోకులం ను కబ్జా చేసిన వైసీపీ నాయకుడు..?
1 min read– భూ కబ్జాల నాయకుడికి అధికార పార్టీలో అండ ఎవరు..?
– భూ అక్రమాలపై స్పందించని రెవిన్యూ అధికారులు.. ?
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గ్రామంలో ఎక్కడ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు అక్కడ ఖాళీ జాగా వేసేయ్ పాగా అన్నట్లుగా చేస్తున్నారు ఒక వైకాపా నాయకుడు ?. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఉన్న ఇళ్ళ పట్టాలు కూడా కబ్జా చేసి రూ. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేతకు అధికార పార్టీ కి చెందిన ఒక నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అండగా ఉన్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నాలుగు రోజుల క్రితం ఏకంగా గత ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం పాడి పశువులకు నీడనిచ్చేందుకు గోకులం షెడ్డు కొరకు 25 సెంట్ల భూమిని కేటాయించి పిల్లర్లు వేశారు. దానిని కూడా అధికార పార్టీకి చెందిన నేత తనకు ప్రజా ప్రతినిధి అండగా ఉన్నారని ఏకంగా భూ కబ్జాకు తెరలేపారు. ఈ భూ కబ్జా తతంగాము ఎక్కడో కాదు జూపాడుబంగ్లా మండల రెవిన్యూ కార్యాలయం సాక్షిగా కార్యాలయం వెనకాలనే జరగడం మండల కేంద్రంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండల కేంద్రంలో మండల తహశీల్దార్ కార్యాలయం వెనకాల ప్రభుత్వ ఎస్సి హాస్టల్ సమీపంలో గత ప్రభుత్వం లో సర్వే నెంబర్ 711 – 2 లో దాదాపు 25 సెంట్లల్లో రూ.20 లక్షలతో మెగా గోకులం షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మెగా గోకులం షెడ్డు నిర్మాణానికి దాదాపు 20 పిల్లర్లను కూడా నిర్మించారు. అయితే గత ప్రభుత్వం ఈ మెగా గోకులం షెడ్డు ఎన్నికల ముందు నిర్మాణం చేపట్టడం వల్ల ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం జూపాడుబంగ్లా మండల కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నేత ఖాళీ జాగా వేసేయ్ పాగా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ భూ కబ్జాకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి తనకు అండగా ఉన్నారని ఈ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని గ్రామంలో ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన మెగా గోకులం షెడ్డు కొరకు నిర్మించిన పిల్లర్లను తొలగించి ఆ పిల్లర్లను కనిపించకుండా చేసి కుంటలో వేశారు. అంతే కాకుండా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు సమీపంలో ఉన్న కొంత భూమిని, మెగా గోకులం షెడ్డు కొరకు నిర్మించిన పిల్లర్లను తొలగించి (దాదాపు 40 సెంట్లు) భూ కబ్జాకు పాల్పడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసిన కూడా నిమ్మకునీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల కార్యాలయాలకు సమీపంలో ఈ భూ కబ్జాలకు పాల్పడిన ఏ అధికారి అటువైపు కన్నెత్తి చూడకుండా ఎవరు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయంపై శుక్రవారం జూపాడుబంగ్లా మండల తహశీల్దార్ కార్యాలయంలో ఆత్మకూరు ఆర్ డి ఓ దాసు ఉండగా సీపీఐ నంద్యాల జిల్లా నాయకుడు ఎం రమేష్ బాబు ఆర్ డి ఓ కు పిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి తహశీల్దార్ ను ఆ స్థలాన్ని పరిశీలించి వెంటనే కబ్జా జరగకుండా కాపాడాలని ఆదేశించారు.
ప్రభుత్వ భూములు కాపాడాలి :
రమేష్ బాబు, సీపీఐ నంద్యాల జిల్లా నాయకులు..గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో ఉన్న భూములు కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు కబ్జా చేస్తున్నారు. ఆ స్థలాలను రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు కాపాడాలి. గోకులం షెడ్డుకు కొరకు కేటాయించిన స్థలం పిల్లర్లు తొలగించి కబ్జాకు తెరలేపడం దారుణం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆ స్థలాన్ని కాపాడాలి. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు పాల్పడితే ఉద్యమాలు చేస్తాం.
ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే చర్యలు తప్పవు :
జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటాము. తహశీల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న స్థలం కబ్జా చేశారని మా దృష్టికి వచ్చింది. స్థలాన్ని పరిశీలించి ఎవరు రాకుండా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ పుల్లయ్య పేర్కొన్నారు.