PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు

1 min read

– బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి
– జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆడపిల్లల చదువును మధ్యలో మాన్పించి వేయకుండా నిరంతరాయంగా విద్యనభ్యసించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలిక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మాబున్నీసా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి, డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ బాలికలు అన్ని రకాల పబ్లిక్ పరీక్షలు, పోటీ పరీక్షలలో టాప్ ర్యాంకులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఈ మేరకు ఆడపిల్లల చదువును మధ్యలో మాన్పించి వేయకుండా నిరంతరాయంగా కొనసాగించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర అల్ప సంఖ్యాక వర్గాల్లోని బాలికలు మధ్యలో చదువు మాన్పివేయకుండా తల్లిదండ్రుల మైండ్ సెట్ లో మార్పు తీసుకురావాలన్నారు. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వం పాఠశాలలోని విద్యా వ్యవస్థపై అనేక మార్పులు తీసుకొచ్చిందని బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అన్ని రంగాలలో మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు కౌమారదశ ఆడపిల్లల్లో దాదాపు 40 శాతం మంది రక్తహీనతతో ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని… వీరందరికీ స్త్రీ శిశు సంక్షేమం, ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పౌష్టికాహారము, ఐరన్ ఫోలిక్ మాత్రల పంపిణీ ముమ్మరం చేసి రక్తహీతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాలికలు, మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబమే సంతోషంగా ఉంటుందని కలెక్టర్ ఉదహరించారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాలలో ముందున్నారన్నారు. గత 30 సంవత్సరాల కిందట ఆడపిల్లలకు ఉన్నత చదువు అవసరం లేదనే అభిప్రాయంతో ఉండేవారన్నారు. మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుందన్న నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాల పథకాల లబ్ధినంతటిని మహిళలకే వర్తింపజేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. అంతేకాకుండా రాజకీయంగా కూడా అన్ని పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి ప్రజా ప్రతినిధులుగా అవకాశం కల్పించారన్నారు. మల్టీ నేషనల్ కంపెనీ సమావేశాల్లో కూడా 50 శాతం మహిళలే ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి లీలావతి మాట్లాడుతూ మహిళల సంరక్షణ కోసం చేపడుతున్న పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రీచ్ కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలను అరికట్టడం, రక్తహీనతను అధిగమించే మార్గాలపై జిల్లా వ్యాప్తంగా మహిళల్లో, బాలికల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్, ఎంపీ తదితరులు మహిళల సంరక్షణపై ముద్రించిన పోస్టర్ ను విడుదల చేసారు. తదుపరి పాఠశాలల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అంతకుముందు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఖజానా శాఖ డీడి లక్ష్మీదేవి, సర్వజన వైద్యశాల సూపర్ ఇంటెండెంట్ ప్రసాద్, ఆచార్య ఎన్జీరంగా సైంటిస్ట్ డాక్టర్ రామకృష్ణ, వరల్డ్ విజన్, సోషల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About Author