ఘనంగా మహిమగిరి మేరీమాత ఉత్సవాలు..
1 min readపల్లెవెలుగు వెబ్ పెదవేగి: పెదవేగి మండలం జానంపేట గ్రామంలో ఉన్నటువంటి మహిమగిరి మేరీమాత ఉత్సవాలు ఏలూరు ప్రధమ పీఠాధిపతులు బిషప్ జాన్ మొలగాడ మరియు ఫాదర్ జాన్సన్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించినటువంటి ఉత్సవాలు గురువారంతో ముగిసాయి. మూడ్రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను జానంపేటలో ఉన్నటువంటి మహిమగిరి శిఖరం ప్రధానాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వికార్ జనరల్ ఏలూరు డయాస్ రెవరెండ్ ఫాదర్ బాల జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వికార్ జనరల్ ఫాదర్ బాల, ఫాదర్ ఫెలిక్స్, ఫాదర్ కరుణాకర్, ఫాదర్ మత్తయి, ఫాదర్ మోజెస్, ఫాదర్ ప్రవీణ్ తదితర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ బాలా మాట్లాడుతూ జానంపేటలో స్థానికంగా ఉన్నటువంటి విద్యాసంస్థల ఫాదర్లు మరియు సిస్టర్లు కూడి ప్రార్థించుకోవడానికి ఈ మహిమగిరీ శిఖరాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా రిపబ్లిక్ డే నాడు జానంపేటలో జరిగే మహిమ గిరి ఉత్సవాలు గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి వల్ల నిలుపుదల చేయాల్సి వచ్చిందని మళ్లీ ఈ సంవత్సరం ఇంత ఘనంగా మూడు రోజులపాటు నిర్వహించడం, ప్రజలుఅత్యధిక సంఖ్యలో హాజరవడం గొప్ప విశేషమని అన్నారు. కుల, మతాలకు అతీతంగా భక్తులు మరియమాతను సందర్శించి చల్లని దీవెన పొందుతారని తెలియజేశారు. మరీ ముఖ్యంగా మన దేశ సార్వభౌమాధికారం కొరకు అహర్నిశలు శ్రమించినటువంటి భారతదేశ స్వతంత్ర సమరయోధులను స్మరించుకుని మరియు ప్రస్తుత పాలకుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరిగిందని తెలియజేశారు.