అందరికి అందుబాటులో ఆపదమిత్రలు
1 min read– ఆపదమిత్ర ప్రాధమిక శిక్షణా కార్యక్రమాన్ని ఆకళింపు చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : విపత్తుల సమయంలో తీసుకొనే జాగ్రత్తలు ఆవగాహన కార్యక్రమాలపై ఇచ్చిన శిక్షణలో పాల్గొన్న ఆపదమిత్ర వాలంటీర్లు వాటిని ఆకళింపు చేసుకుని సమాజానికి ఉపయోగపడాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. ప్రకృతి వైపరిత్యాల నిర్వహణపై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్ధ మరియు ఎపిఎస్ డిఎంఎ, ఎపిఎస్ఐఆర్ డిపిఆర్ ఆద్వర్యంలో సోమవారం స్ధానిక జెవిఆర్ నగర్ లోని సోషల్ సర్వీస్ సొసైటీ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన 5వ బ్యాచ్ ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణా ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరదలు, తుఫానులు వంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం మాత్రమే అన్ని చర్యలు తీసుకోవడం సాధ్యంకాదని ఇందులో ప్రజా స్వామ్యంకూడా ఎంతో అవసరం అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆపదమిత్ర వాలంటీరు శిక్షణను చేపట్టడం జరిగిందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఆపదమిత్రలకు అందించిన కార్యక్రమాలను ఒకసారి ఆకళింపుచేసుకోవాలన్నారు. విపత్తుల సమయంలో ఆపదమిత్రులు తమ బాధ్యతను పూర్తిస్ధాయిలో నిర్వహించి బాధితప్రాంత ప్రజలకు ప్రాణ, ఆస్ధినష్టం జరుగకుండా రక్షించాలన్నారు. వీరు అగ్నిమాపక తదితర శాఖల అధికారులు అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి అందించిన మెటీరిఎల్ ను వినియోగించుకోవడంలో నైపుణ్యత సాధించాలన్నారు. జాతీయ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్ధలు విపత్తుల ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంత ప్రజలకు తగిన ప్రాధమిక అవగాహన కల్పించేందుకు ఆపదమిత్ర శిక్షణా తరగతులు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. జాతీయ రాష్ట్ర విపత్తుల దళాలు ఆయా విపత్తులు జరిగే ప్రాంతాలకు చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆలోపు స్ధానికంగా అందుబాటులో ఉన్న ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తులు సంభవించే ప్రాంతాలకు చేరుకొని ప్రజలను అప్రమత్తం చేయడంలోను ప్రజలకు రక్షణ కల్పించడంలోను అందుబాటులో ఉంటారన్నారు. ఇంతవరకు ఏలూరు జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, కలిదిండి, ఏలూరు, దెందులూరు, గణపవరం, కైకలూరు, నూజివీడు, పెదపాడు, పెంటపాడు, భీమడోలు మండలాల్లోని 251 మంది ఆపదమిత్రులుగా శిక్షణ పొందారన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు శిక్షకులను తీసుకువెళ్లి వాస్తవ పరిస్ధితులపై సమగ్రమైన అవగాహన కల్పించడంతోపాటు గ్రామ, పంచాయితీల్లో లభించే సహజవనరులు, సామాజిక వనరులు, సోషల్ మ్యాపింగ్, గత విపత్తుల చరిత్ర వంటి పలు అంశాలపై ఫీల్డ్ విజిట్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. విపత్తుల సమయంలో బాధితులకు అందుబాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఆపదమిత్ర వాలంటీర్లపై ఉందన్నారు. జెడ్పి సిఇఓ కె.వి.ఎస్.ఆర్. రవికుమార్ మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 30వ తేదీ వరకు 12 రోజులుపాటు 5వ బ్యాట్ ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఆపదమిత్ర శిక్షణ పొందిన వారందరికి సేఫ్టి కిట్స్ తోపాటు సర్టిఫికెట్లను కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి జివికె మల్లిఖార్జునరావు, జిల్లా ట్రైనింగ్ మేనేజరు జి. ప్రసంగిరాజు, జిల్లా విపత్తుల నిర్వహణా మేనేజరు సిహెచ్ రత్నబాబు, రీసోర్స్ పర్సన్ కె.ఎన్.రాజు, డిపిఆర్ సి సిబ్బంది పాల్గొన్నారు.