ఏపీలో.. బీసీలపై కుట్ర..!
1 min read– బీసీలకు చట్టబద్దంగా న్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
– బీసీలను పట్టించుకోని ఏపీ ప్రభుత్వం..
– కులానికో కార్పొరేషన్…
– 10లక్షల మంది రజకులకు.. లక్షా 65వేల మందికే… జగనన్న చేదోడు..
– సెలూన్ షాపులున్న నాయీ బ్రాహ్మణులకే రూ.10వేలు
– బీసీలను రాజకీయంగా.. ఆర్థికంగా తొక్కిపడేసిన జగన్
– జాతీయ ఓబీసీ మోర్చా పతాధికారుల సమావేశంలో ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి వెల్లడి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : దేశ జనాభాలో 55శాతం (75 కోట్లు) ఉన్న బీసీల అభ్యన్నతికి కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని వెల్లడించారు ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. బీసీలను రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా అభివృద్ధి చెందాలన్న తపనతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బీసీలపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సోమవారం హర్యాన రాష్ట్రం గురుగ్రామ్లో ఓబీసీ మోర్చా జాతీయ పతాధికారుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఏపీ తరుపున పాల్గొన్న ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థ సారధి పలు అంశాలను మీడియాకు వెల్లడించారు.
బీసీలపై…కుట్ర..
కేంద్రీయ విద్యాలయంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్, నీట్ తదితర ఎంట్రెన్స్ పరీక్షలలో బీసీలకు రిజర్వేషన్ కేటాయించిన కేంద్ర ప్రభుత్వం… బీసీల అభ్యున్నతికి అనేక చేయూత పథకాలు అందిస్తోందన్నారు డా. పార్థసారధి. కానీ ఏపీలో మాత్రం బీసీలపై కుట్ర జరగుతోందని ఆరోపించారు. రాష్ట్ర జనాభాలో 2 కోట్ల 15లక్షలమందికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా… సామాజికంగా.. ఆర్థికంగా అణగదొక్కుతోందని ధ్వజమెత్తారు. ఒక బీసీ కార్పొరేషన్ తొలగించి.. కులానికో కార్పొరేషన్ అంటూ 56 కార్పొరేషన్లు తీసుకొచ్చి బీసీలను విభజించి పాలిస్తున్న ఘనత ఒక్క జగన్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ స్థానాలను బీసీలకు 10శాతం తగ్గించి… దాదాపు 16వేల మందిని రాజకీయంగా దూరం చేశారని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో 10లక్షల మంది రజకులు ఉండగా లక్షా 65వేల మందికి జగనన్న చేదోడు కింద రూ.10వేలు ఇస్తున్నాడని, సెలూన్ షాపులున్న నాయీ బ్రాహ్మణులకే చేయూత కింద రూ.10వేలు ఇవ్వడం దారుణమన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యన్నతికి అవసరమైన అంశాలను ఓబీసీ జాతీయ మోర్చా సమావేశంలో సుధీర్ఘంగా చర్చిస్తామన్న డా. పార్థసారధి… బీసీలను రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా.. ఎదుగుదలకు తమవంతు కృషి చేస్తామన్నారు.