అక్రమం కాదు.. సక్రమమేనట..!
1 min read– నల్లమట్టి తవ్వకాలకు.. అధికారులే అనుమతిచ్చారట..?
– ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నల్లమట్టి మాఫియా
– శ్రీశైలం ప్రాజెక్టు మునక పొలాలలో అక్రమంగా మట్టి దందా..
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గంలో నల్లమట్టి మాఫియా చెలరేగుతోంది.. ఇదేమని ప్రశ్నిస్తే… అధికారులే అనుమతిచ్చారు… మీరెవరు ప్రశ్నించడానికి… అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఈ ఘటన శ్రీశైలం మునక గ్రామాల ప్రజలకు ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి. నందికొట్కూరు మండలం శాతన కోట గ్రామ సమీపంలోని జంగంపాడు వద్ద శ్రీశైలం ప్రాజెక్టు మునక పొలాల్లో అక్రమార్కులు దర్జాగా నల్లమట్టిని తరలిస్తున్నారు. రాత్రింబవళ్లు ..బహిరంగంగా నల్లమట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నా.. ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడంలేదు.
రైతుల పొలాలకంటూ…
మునక భూముల లోని నల్ల మట్టి చాలా సారవంతమైనది. దీంతో అక్రమార్కుల కన్ను నల్ల బంగారంపై పడింది. రైతుల పొలాల్లోకి తోలుతున్నామని చెబుతూ.. ఒక ట్రాక్టర్ లోడుకు రూ. 6వేలు నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు 15 ట్రాక్టర్ ల ద్వారా 200 ట్రిప్పులు తోలుతున్నారు. ఒక్కొక్క రైతు 20నుంచి 50 ట్రిప్పుల దాకా పొలానికి సరిపడే మట్టిని వేయించుకుంటున్నారు. దీంతో అక్రమార్కులు మట్టి మాఫియాకు తెరలేపారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములలో అక్రమంగా తవ్వకాలను చేపట్టి మట్టి ని తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తికుడా చూడడం లేదు. పలువురు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
బరితెగింపు…!
ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు భారీగా గండి కొడుతున్నా అటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ భూములలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టిన విషయం తెలుసుకున్న పాత్రికేయులు అక్కడికి వెళ్లి ఫొటోలు తీస్తుండగా మీడియా వాళ్ళు చూసీచూడనట్లు వెళ్లిపోవాలని నాయకులు, కొంతమంది అధికారులు ఫోనులో ఉచిత సలహాలు ఇవ్వడం కొసమెరుపు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను అధికారులు అడ్డుకొని… అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు కోరారు.