ఇంటింటికి మునగమొక్క( మోరింగ )
1 min read– మునగలో ఔషద గుణాలు బోలెడు ఉన్నాయి..
– మునగ మొక్కల పంపిణీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : బహుళ ఔషద ఉపయోగాలు కలిగిన మునగ చెట్టుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి మునగ మొక్కలు ఉచితంగా పంపిణీకి నర్సరీలు సిద్దం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం భీమడోలు నర్సరీలో డ్వామా ఆధ్వర్యంలో సిద్దం చేసిన మునగ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మునగలో విటమిన్ సి, మాంసకృతులు, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయని, మునగ ఆకు, చెట్టు వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లో అవగాహన పెంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఔషద గుణాలు ఉన్న మునగ మొక్కలను(మోరింగ) పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఉపాధిహామీ పథకం కింద మునగ మొక్కల నర్సరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా భీమడోలులో ఏర్పాటు చేసిన నర్సరీలో 10 వేల మొక్కలు ఉచితంగా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా మునగ మొక్కల నర్సరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నర్సరీలో పెంచిన మునగ మొక్కలను పెరటి తోట పెంపకం కింద ఆయా ఇంటి పెరటి స్ధలంను బట్టి ప్రతి మహిళకు 2 నుంచి 5 మొక్కల వరకు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. మహిళల్లో ఐరన్ లోపాన్ని నివారించేందుకు, పౌష్టికాహారంగా మునగ ఆకు ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, డిఆర్ ఓ ఎవిఎన్ఎస్ మూర్తి, డ్వామా పిడి డి. రాంబాబు, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, డిఆర్ డిఏ పిడి ఆర్. విజయరాజు తదితరులు పాల్గొన్నారు.