ఉపాధ్యాయుల జీతాల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్నటువంటి రెండు లక్షల మంది ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం అత్యంత బాధాకరమని ప్రతి నెల జీతాల కోసం ఎదురుచూడడం అత్యంత విచారకరమని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి విమర్శించారు. ఈ మేరకు తేదీ 06-02-2023 న స్థానిక సలాం ఖాన్ ఎస్టీ భవన్లో ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్ గోకారి అధ్యక్షతన జరిగినది ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ. (1) ఉపాధ్యాయులందరూ ప్రతినెల జీతాల కోసం ఎదురుచూడటం బాధాకరంగా అవమానకరంగా ఉందని ఈ పరిస్థితులు వస్తాయని ఊహించలేదని విమర్శించారు. (2) విద్యాశాఖ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు ప్రతినెల 1వ తారీకు కోసం జీతాలు పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడటం అత్యంత బాధాకరమని ఇంతటి దయనీయ పరిస్థితులు ఏ ప్రభుత్వంలో కూడా లేవని ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదని విమర్శించారు. (3) సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కడానికి ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక వర్గమైన ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల జీతాల పట్ల శ్రద్ధ లేకపోవడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. (4) ఈరోజు ఆరో తారీకు అయినప్పటికీ గత నెల జీతాలు ఈరోజు వరకు అందకపోవడం అత్యంత విచారకరమని దీనివలన బ్యాంకుల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు నెలసరి వాయిదాలు చెల్లించలేక పెనాల్టీ కట్టాల్సి వస్తుందని దీనివల్ల వారి యొక్క సిబిల్ స్కోర్ కూడా తగ్గి భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. (5) ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల జీతాలపట్ల శ్రద్ధ పెట్టి ప్రతి నెల ఒకటో తారీకు జీతము పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో జీతాల కోసం కూడా రోడ్డెక్కి ధర్నాలు చేయడానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వెనుకాడదని హెచ్చరించారు. (6) గత సంవత్సర కాలంగా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావలసినటువంటి భవిష్యనిధి, జీవిత బీమా, సంపాదిత సెలవుల నగదీకరణ, మెడికల్ రీయంబర్స్మెంట్, తదితర ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని వీటిని చెల్లించకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు వారి యొక్క పిల్లల పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవలసి రావడం అత్యంత బాధాకరమని విమర్శించారు. (7) ఈ ప్రభుత్వ హయాంలో గత మూడేళ్లుగా ఒక్క కరువు భత్యం కూడా విడుదల చేయలేదని పైగా 11 వ పీఆర్సీ బకాయిలు దాదాపు రెండు వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో కూడా తెలియని పరిస్థితులు దాపరించాయని విమర్శించారు. (8) రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు 34000 పదోన్నతులు ఇస్తున్నట్లు ఊదరగొట్టి చివరకు 4000 కూడా సక్రమంగా ఇవ్వలేక అసంబద్ధ నిర్ణయాలతో 2000 మంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లే విధంగా పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహించిందని విమర్శించారు. (9) విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదోన్నతి పేరుతో 2500 రూపాయలతో అలవెన్స్ ఇస్తూ పదోన్నతి కల్పించినట్లు ఉపాధ్యాయులను బ్రమల్లో ముంచుతున్నారని విమర్శించారు. (10) రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఉపాధ్యాయులు అందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ శ్రీ కత్తి నరసింహారెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయందరి పైన ఉందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎస్టియు రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ సయ్యద్ ముధసిర్ అహ్మద్ సీనియర్ నాయకులు సుధీర్, షఫీ, రహీం తదితరులు పాల్గొన్నారు.