మార్చి నాటికి 8 సబ్ స్టెషన్ల నిర్మాణం
1 min read– ఈ నెల 9వ తేదీన ఏలూరులో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై పరిష్కార వేదిక…
– ఎపిఇపిడిసిఎల్ ఎస్ ఇ పి. సాల్మన్ రాజు వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 నుండి 7 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న 8 జగనన్న మెగా లేఅవుట్లలో మార్చి నెలాఖరునాటికి 8 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఎపిఇపిడిసిఎల్ ఎస్ ఇ పి. సాల్మన్ రాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. మంగళవారం స్ధానిక ఆర్ ఆర్ పేట లోని విద్యుత్ భవన్ సర్కిల్ ఆఫీసులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న హౌసింగ్ కాలనీల్లో విద్యుధీకరణ ప్రగతి తీరును ఆయన ఛాంబర్ లో మంగళవారం పాత్రికేయులకు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నవరత్నాలు-పేదలందరికి ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా 1145 లే అవుట్లలో లక్షా 50 వేల ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా 305 లే అవుట్లలో విద్యుధీకరణ పూర్తి చేశామని తద్వారా 7 వేల ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మరో 40 నుంచి 50 లే అవుట్లలో సుమారు 6 వేల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు విద్యుధీకరణ పనులు శర వేగంగా జరుగుతున్నాయన్నారు. అదే విధంగా 7 వేల ఇళ్ల నిర్మాణాలకు ఏర్పాటు చేసిన 8 పెద్ద లే అవుట్లలో ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఆయా ప్రాంతాల్లో 8 మెగా విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మార్చి నెలాఖరు నాటికి నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా పనులు వేగవంతం చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ ఏలూరు ఆపరేషన్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 9వ తేది గురువారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఏలూరు ఆర్ ఆర్ పేట విద్యుత్ భవన్ నందు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లులో సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, బిల్లులో పేరు మార్పిడి సరఫరా పునరుద్ధరణలో ఇబ్బందులు, నియంత్రికల మార్పిడి తదితరాలుపై పిర్యాదులను ఈ సదస్సులో వినియోగదారులు అందించవచ్చన్నారు. సమావేశంలో పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.