పసి హృదయాన్ని పదిలంగా చూసుకుందాం
1 min read– పుట్టుకతో వచ్చే గుండె వ్యాధుల వారోత్సవంఫిబ్రవరి 7 నుండి 14 వరకు
–డా. సి.హెచ్. రాజ్ కుమార్ కన్సల్టెంట్ ఇంటర్వేషనల్ కార్డియాలజిస్ట్
– కిమ్స్ హాస్పిటల్, కర్నూలు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పుట్టుకతో అనేక మంది చిన్నారులు గుండె జబ్బులతో జన్మిస్తున్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జబ్బులు రాకుండా ఎలా ఉండాలనే అంశం మీద ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండో వారంలో పుట్టకతో వచ్చే గుండె జబ్బులు (సి హెచ్ డి) అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గుండె లోపాలు అనగానే అదేదో అరుదైన సమస్యనే చాలామంది భావిస్తుంటారు. నిజానికిది పెద్ద సమస్య. ప్రతిరోజూ ప్రతి వెయ్యి కాన్పుల్లో 10 మంది శిశువులు.. అంటే ఒక శాతం మంది గుండె లోపాలతో పుడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏటా 20వేల మంది పిల్లలకు పుట్టుకతోనే గుండె లోపాలు ఉంటుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో వీటిపై ఒకింత అవగాహన పెరగటం నిజమే. లోపాలను తొలిదశలోనే గుర్తించగలుగుతున్నాం కూడా. దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టటం ఎంతైనా అవసరం. గుండె లోపాలకు వీలైనంత త్వరగా చికిత్స చేయిస్తే మంచి ఫలితం కనిపిస్తుందని తెలుసుకోవాలి. వీటిపై అవగాహన కలిగుండటం మన బాధ్యతని గుర్తించాలి.
సమస్యలు:
అతి సున్నితమైన గుండె నిర్మాణం సంక్లిష్టమైంది. పిండంలో 21వ రోజుకే గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ మొదలవుతాయి. గుండె గదులు 4 వారాల కల్లా ఏర్పడతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో ఎక్కడ పొరపాట్లు జరిగినా లోపాలకు దారితీస్తాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి..గుండెలో రంధ్రాలు (సెప్టల్ డిఫెక్ట్స్): గుండె లోపాల్లో సుమారు 25% ఇవే.
కారణాలేంటి?
పిండం ఎదిగే సమయంలో గుండె లోపాలు తలెత్తటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
పోషకాల లోపం: గుండె లోపాల విషయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని గురించే. గర్భం ధరించిన తొలినాళ్లలో పోషకాల లోపం.. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం గర్భస్థ శిశువులో గుండె లోపాలకు దారితీయొచ్చు.గర్భిణికి ఇన్ఫెక్షన్లు: తొలి మూడు నెలల్లో.. ముఖ్యంగా పిండంలో గుండె ఏర్పడే దశలో రుబెల్లా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సైతం లోపాలకు దారితీయొచ్చు.మేనరిక వివాహాలు: మేనరిక పెళ్లి చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన కారణాలతోనూ గుండె లోపాలు తలెత్తొచ్ఛు మేనరిక వివాహాలు చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లల్లో ప్రతి వెయ్యిమందిలో 40-50 మందికి గుండె లోపాలు ఉండే అవకాశముంది. వీరికి ఇతరత్రా లోపాల ముప్పూ ఎక్కువే.జన్యు లోపాలు: కొందరికి జన్యు లోపాలతోనూ గుండె నిర్మాణ ప్రక్రియ అస్తవ్యస్తం కావొచ్చు.పురుగుల మందులు, రేడియేషన్: గర్భం ధరించిన తొలివారాల్లో పురుగు మందులు, రేడియేషన్, కొన్నిరకాల మందుల ప్రభావానికి గురైనా గుండె లోపాలు తలెత్తొచ్చు.పొగ, మద్యం అలవాట్లు: గర్భధారణ సమయంలో పొగ తాగటం, మద్యం తాగటం వంటి అలవాట్లతోనూ గుండె ఏర్పడే ప్రక్రియ అస్తవ్యస్తం కావొచ్ఛు ఇది లోపాలకు దారితీయొచ్చు.
గుర్తించటమెలా?
- గుండె వైఫల్య లక్షణాలు: సాధారణంగా గుండెలో రంధ్రాలు ఏర్పడినవారిలో ఇవి కనిపిస్తుంటాయి. గుండె గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు చెడు రక్తంతో మంచి రక్తం ఎక్కువగా కలిసిపోతుంటుంది. దీంతో ఊపిరితిత్తులకు మరింత ఎక్కువగా రక్తం చేరుకుంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు తడితడిగా అయిపోతాయి. దీంతో పిల్లలు పాలు సరిగా తాగలేరు. ఆయాసం, తరచూ న్యుమోనియా బారినపడటం వంటివీ వేధిస్తాయి.
- చర్మం నీలం: చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోయి, ఒళ్లంతా విస్తరించటం వల్ల పెదాలు, వేళ్లు, నాలుక వంటిని నీలంగా అవుతాయి. కొందరికి ఉన్నట్టుండి నీలంగా అవటం ఎక్కువ కావొచ్ఛు కనుగుడ్లు తేలేయొచ్చు.
- నిస్సత్తువ: కవాటాలు బిగుసుకుపోవటం, లీక్ అయ్యేవారిలో అలసట, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి. పెద్దగా అయ్యాక శారీరకశ్రమను అంతగా తట్టుకోలేరు, ఆటలకు దూరంగా ఉంటుంటారు. తోటివారితో ఆడుకోవటానికి వెనకాడుతుంటారు.
ఎంత ముందుగా గుర్తించొచ్చు?
గుండె లోపాలను 18 వారాల గర్భం సమయంలోనే గుర్తించొచ్ఛు ఇందుకు ఫీటల్ ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా సురక్షితం. ఒంట్లోకి గొట్టాల వంటివి పంపించాల్సిన పనిలేదు. సమస్యలను కచ్చితంగా నిర్ధారించొచ్ఛు.
గుండె లోపాలు మున్ముందు ఎలా పరిణమిస్తాయి?
బిడ్డ ఆరోగ్యం ఎలా ఉండగలదు అనేవీ తెలుస్తాయి. దీన్ని బట్టి ముందుగానే శస్త్రచికిత్సలను నిర్ణయించుకోవచ్ఛు కవాటాలు మూసుకుపోయినవారికి కొన్నిసార్లు గర్భంలో ఉండగానే సరిదిద్దే పద్ధతులూ అందుబాటులో ఉన్నాయి.
లోపాలు పోతాయా?
గుండె, ఊపిరితిత్తుల పనితీరు బాగా అర్థం కావటం, అధునాతన పరికరాలు అందుబాటులోకి రావటం, సుశిక్షితులైన సిబ్బంది, శస్త్రచికిత్స అనంతరం సేవల వంటివన్నీ గుండె లోపాలతో సంభవించే మరణాలకు అడ్డుకట్ట వేయటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అధునాతన చికిత్సలతో చాలావరకు గుండె లోపాలను పూర్తిగా సరిదిద్దొచ్ఛు కొందరికి తొలిదశలో ఆయా లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే చికిత్సలు అవసరపడొచ్ఛు పూర్తిగా సరిదిద్దటం సాధ్యం కానివారికి అవసరమైనప్పుడల్లా ఉపశమన చికిత్సలు చేయాల్సి ఉంటుంది. మందులు-శస్త్ర చికిత్సలుముందుగానే గుండె రంధ్రాలను గుర్తించగలిగితే తగు మందులు ఇవ్వటం, ఆహార పరంగా జాగ్రత్తలు పాటించటం ద్వారా దుష్ప్రభావాలు ముంచుకురాకుండా చూసుకోవచ్ఛు ఇందుకోసం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రక్తహీనత మూలంగా గుండె విఫలమయ్యే ముప్పు పొంచి ఉండటం వల్ల ఐరన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సుమారు 60% రంధ్రాలు వాటంతటవే మూసుకుపోతాయి. వీటికి శస్త్రచికిత్సలు అవసరం లేదు. గుండె లోపాలతో పుట్టిన వారిలో సుమారు 20% మందికి పుట్టిన నెల లోపే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మిగతావారిలో చాలామందికి బడికి వెళ్లే వయసులో శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చు. శిశువుకు.. అదీ గుండెకు శస్త్రచికిత్స అంటే భయం కలగటం సహజమే. ఇప్పుడు అంత భయపడాల్సిన పనేమీ లేదు. గుండె లోపాల్లో సుమారు 30% సమస్యలను గొట్టం సాయంతో చేసే శస్త్రచికిత్సలతోనే సరిచేయొచ్ఛు ఇందులో ఎలాంటి మచ్చ ఏర్పడదు. పిల్లలు త్వరగా కోలుకుంటారు.పల్మనరీ స్టెనోసిస్ , అయోర్టిక్ స్టెనోసిస్ వంటి సమస్యలకు గుండెలోకి బెలూన్ను పంపించి, దాన్ని ఉబ్బించటం ద్వారా కవాటాలను వెడల్పు చేస్తారు. గుండెలో రంధ్రాలను అంబ్రెల్లా పరికరాలతో సమర్థంగా మూసేయొచ్చు జఠరిక గోడ రంధ్రాలను మూసేయటానికి ప్రస్తుతం కోనార్ ఎంఎఫ్ పరికరం సైతం అందుబాటులో ఉంది.