బంగారం ఎందుకంత విలువైనది..?
1 min readపల్లెవెలుగు వెబ్: మానవాళి అత్యంత ఇష్టపడే లోహం బంగారం. డబ్బు తర్వాత మానవ సంపదను కొలిచే సూచిక బంగారం మాత్రమే. మానవ పరిణామక్రమంలో లోహాలలో బంగారానికి అపారమైన విలువ జోడించబడింది. బంగారానికి ఉన్న ప్రత్యేకత.. దాని ధరలో ప్రతిబింబిస్తుంది. మానవాళి బంగారం కోసం యుద్ధాలు కూడ చేసింది. డబ్బు కంటే ముందు ఒక మారకంగా బంగారాన్ని ఉపయోగించారు.
ఎందుకంత విలువ ? :
బంగారాన్ని భూగర్భంలో నుంచి వెలికితీయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలాగే వెలికితీసిన బంగారాన్ని శుద్ధి చేయాలంటే కూడ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒక లోహాం విలువ దానిని వెలికితీయడానికి అయ్యే ఖర్చు, ప్రజల్లో వాటికి ఉన్న డిమాండ్ ఆధారంగా దాని విలువను నిర్ణయిస్తారు. బంగారానికి తుప్పు పట్టే గుణం లేదు. మిగిలిన లోహాలు తుప్పు పడతాయి. అలాగే బంగారానికి ఆక్సీకరణం చెందే గుణం లేదు. దాని బరువు స్థిరంగా ఉంటుంది. మిగిలిన లోహాల కంటే బంగారం మానవాళి వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. బంగారాన్ని అలంకరణ వస్తువుగా ఉపయోగిస్తారు. మిగిలిన లోహాల కంటే సులువుగా బంగారాన్ని మనకు నచ్చిన డిజైన్లలో మార్చుకునే సౌలభ్యం ఉంటుంది.
ధరలు ఎందుకు పెరుగుతాయి..?
బంగారం ధరలను ఏ సంస్థ, ఏ ప్రభుత్వం నిర్ణయించదు. సాధారణంగా బంగారం ధర.. దానిని వెలికితీసి శుద్ధి చేసి.. వినియోగానికి అనుకూలంగా మార్చడానికి అయిన శ్రమ, వ్యయం ఆధారంగా విలువను నిర్ణయిస్తారు. అయితే.. బంగారం ధరల్లో నిరంతరం పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ ఉండటానికి ప్రజల్లో దానికి ఉన్న డిమాండ్ కారణం. బంగారం లభ్యతకు మించి బంగారం కొనేవారు పెరిగితే బంగారం ధరల్లో పెరగుదల ఉంటుంది.
- బంగారాన్ని ఆభరణంగా ధరించినా మానవ శరీరానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. బంగారం రసాయనికంగా జడత్వం కలిగి ఉంటుంది. మనిషి బంగారాన్ని ధరించడం వల్ల ఎలాంటి రసాయనిక చర్య జరగదు. అందువల్ల మిగిలిన లోహాల కంటే బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వివిధ ప్రత్యేకతల వల్ల బంగారానికి విశేషమైన విలువ ఉంటుంది.