పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
1 min read– ఐసిడిఎస్ ఇంచార్జి పిడి ధనలక్ష్మి
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు పంపిణీ చేసే పౌష్టికాహారంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐసిడిఎస్ పిడి యం.ధనలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నమయ్య జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 2275 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ కేంద్రాల పరిధిలోని చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతోందన్నారు.గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలలోనే మధ్యాహ్న భోజనం చేసేవిధంగా అన్ని వసతులు కల్పించి వారు తప్పకుండా అక్కడే భోజనం చేసే విధంగా చూడాలని సిడిపిఓ లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.గర్భిణీలు, బాలింతలకుప్రతిరోజు క్రమం తప్పకుండా మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తున్నామని ఇందులో ఎటువంటి నాణ్యతాలోపం వున్నా వెంటనే తమకు తెలియజేయాలన్నారు. పౌష్ఠికాహారం నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను తరచూ విజిట్ చేయడం జరుగుతోందని ఇక్కడపని చేసే టీచర్లు, కార్యకర్తలు, సిబ్బంది సమయపాలన పాటించి విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఇక నుంచి పౌస్టికాహారం సక్రమంగా పంపిణీ చేయకపోయినా…! సిబ్బంది సమయ పాలన పాటించక పోయినా…! వెంటనే ఆ ప్రాంత ప్రజలు తమకు ఫిర్యాదు చేయాలన్నారు.