ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి
1 min read– పశ్చిమ గోదావరి జిల్లా స్ధానిక సంస్ధల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో
– ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి..
– జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా స్ధానిక సంస్ధల నియోజకవర్గపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల నిర్వహణకు చేపట్టవలసిన పలు అంశాలను వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ఎన్నికల కమీషన్ జారీ చేసిన నియమనిబంధనలను , సూచనలను తెలియజేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు నియమించిన నోడల్ అధికారులు తమకు నిర్ధేశించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఏ అంశంలోనైనా అనుమానాలు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులతో నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నర్సాపురం, భీమవరం, ఎంపిడివో కార్యాలయాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబంధిత పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లను ముందస్తుగా పరిశీలించుకోవాలన్నారు. ఎంపిటిసిలకు అవసరమైన గుర్తింపు కార్డులను జారీ చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీచేసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను జాప్యంలేకుండా జారీ చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, హెల్ప్ లైన్-కంప్లయింట్ సెల్, శిక్షణా కార్యక్రమం కమ్యూనికేషన్ ప్లాన్, రవాణా సౌకర్యం, ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు పంపవలసిన నివేదిక సమర్పణ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు దిశా నిర్ధేశం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ బంధోబస్తు ఇతర ఏర్పాట్లను చేయాలన్నారు. రోజువారీ మద్యం విక్రయ వివరాలను అందజేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎంసిసి కమిటీలు అప్రమత్తంగా ఉండి సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎవిఎన్ఎస్ మూర్తి, ఎస్ఇబి అధనపు ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, ఏలూరు ఆర్ డివో కె. పెంచల కిషోర్, జెడ్పి సిఇఓ కె.వి.ఎస్.ఆర్.రవికుమార్, డ్వామా పిడి డి. రాంబాబు, కలెక్టరేట్ ఏవో ఎ. రమాదేవి, ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ ఎన్ బాలకృష్ణన్ డిఇఓ ఎన్ .వి .రవిసాగర్, ఎన్ఐసి డిఐఓ జివిఎస్ఆర్ శర్మ తదితరులు పాల్గొన్నరు.